Share News

సింగరేణి నుంచి శ్రీధర్‌ ఔట్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:01 AM

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ఎన్‌.శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.

సింగరేణి నుంచి శ్రీధర్‌ ఔట్‌

డైరెక్టర్‌ బలరాంకు సీఎండీగా అదనపు బాధ్యతలు

నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

2015 నుంచి సీఎండీగా ఉన్న శ్రీధర్‌పై పలు ఆరోపణలు

కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినా అప్పట్లో బేఖాతరు

ఓపెన్‌ కాస్ట్‌ టెండర్లు ప్రైవేట్‌ సంస్థకు వెళ్లేలా ఉదాసీనత

సీఎస్‌ఆర్‌ నిధుల తరలింపు కారణంతో వేటు వేసినట్లు చర్చ!

అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ శ్రీదేవి తొలగింపు

హైదరాబాద్‌, కొత్తగూడెం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) ఎన్‌.శ్రీధర్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి డైరెక్టర్‌ (పా-ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఎన్‌.బలరాంకు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీర డంతోనే సింగరేణి సీఎండీ మార్పు ఖాయమని, భారీ ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం సాగింది. దీనికితగ్గట్లే.. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించిన వారం రోజుల్లోపే చైర్మన్‌ను పక్కనపెట్టడం గమనార్హం. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) నిధులను సింగరేణి సమీప ప్రాంతాలకు కాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్‌, నిజామాబాద్‌ తదితరచోట్లకు తరలించారని కార్మిక నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్‌ను పక్కన పెట్టిందనే చర్చ కోల్‌ బెల్ట్‌లో జరుగుతోంది. కాగా, తన నియామకం అనంతరం బలరాం సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీలను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఏకధాటిగా.. 9 ఏళ్లుగా

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో.. శ్రీధర్‌ 2015 జనవరి 1న సీఎండీగా నియమితులయ్యారు. బీఆర్‌ఎస్‌ విధేయుడని, ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలు మాత్రమే పాటిస్తారని ఆయనపై ఆరోపణలున్నాయి. కోల్‌బెల్ట్‌లో కాంట్రాక్టుల నుంచి ఉద్యోగ నియామకాల వరకు గత సర్కారుకు అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలూ వచ్చాయి. శ్రీధర్‌ను కొనసాగించడంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సింగరేణి పాలక మండలి సమావేశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినా బీఆర్‌ఎస్‌ సర్కారు పట్టించుకోలేదు. ఓ దశలో జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) సీఎండీ పోస్టుకూ శ్రీధర్‌ దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామక మండలి ఆయన పేరును సిఫారసు చేసింది. అయితే, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ అనుమతి ఇవ్వలేదు.

నియామకాల్లో అక్రమాలు..

శ్రీధర్‌ హయాంలో 2016లో నిర్వహించిన 478 క్లరికల్‌ పోస్టుల రాత పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, కొన్ని జిల్లాల్లో ఒకే కుటుంబానికి చెందినవారికి ఉద్యోగాలు వచ్చాయంటూ కార్మిక సంఘాల నాయకులు గత ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో డీజిల్‌ కుంభకోణంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకుండా రెండు ఇంక్రిమెంట్ల కోత విధించి విధుల్లో కొనసాగించారనే ఆరోపణలున్నాయి. సింగరేణి నిధులను భారీగా సమకూర్చిన రామగుండం వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు సీట్లు చాలా తక్కువగా కేటాయించారని, అదే నిధులతో సింగరేణి మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదనే శ్రీధర్‌పై విమర్శలు వచ్చాయి. నాలుగు కీలక ఓసీలైన కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, శాంతి గనులకు కేంద్రం టెండర్లను పిలిచినా సింగరేణి యాజమాన్యం టెండర్లు దాఖలు చేయకపోవడం వల్ల అవి ప్రైవేటు సంస్థలకు వెళ్లాయనే ఆరోపణలు వచ్చాయి. సింగరేణి ఉన్నత ఉద్యోగుల మస్టర్ల విక్రయాలపై కాగ్‌ తీవ్రంగా తప్పుపట్టిందని కూడా కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ ఔట్‌

రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ మంత్రి శ్రీదేవిని ప్రభుత్వం తొలగించింది. ఈమేరకు ఆమె పదవిని రద్దు చేస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. చైర్‌పర్సన్‌ కోసం అప్పట్లో నియమితులైన సిబ్బందిని సైతం వారి మాతృ శాఖకు పంపుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కాగా, 2022 జూన్‌ 30న శ్రీదేవిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించింది.

సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు నరేంద్రరావు ఫుడ్‌ కమిషన్‌కు..

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా పదేళ్ల పాటు చక్రం తిప్పిన ఎం.నరేంద్రరావుపై బదిలీ వేటు పడింది. రెవెన్యూలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న నరేంద్రరావును ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా బదిలీ చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నంత కాలం నరేంద్రరావు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కొందరు ఉద్యోగులు సీఎం రేవంత్‌ను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.. నరేంద్రరావును బదిలీ చేసింది.

Updated Date - Jan 03 , 2024 | 03:01 AM