Share News

నిధుల కోసం ఈనెల 20న ప్రత్యేక భేటీ

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:26 AM

తెలుగు రాష్ట్రాల నుంచి నిధులు రాబట్టుకునే అంశంపై చర్చించడానికి వీలుగా ఈనెల 20న బోర్డు సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది.

నిధుల కోసం ఈనెల 20న ప్రత్యేక భేటీ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల నుంచి నిధులు రాబట్టుకునే అంశంపై చర్చించడానికి వీలుగా ఈనెల 20న బోర్డు సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది. ప్రస్తుతం బోర్డు వద్ద లభ్యత ఉన్న నిధులు ఈనెల(మే1 నాటికి) వేతనాలకే సరిపోతాయి. నిధుల లేమితో కార్యకలాపాలు పూర్తిగా మందగించాయని, రెండు రాష్ట్రాలు అంగీకారం మేరకు నిధులు ఇవ్వాలని బోర్డు కోరుతోంది. మరోవైపు నీటి లెక్కలు తేలాలంటే కచ్చితంగా టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీనికోసం తెలుగు రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని బోర్డు డిమాండ్‌ చేస్తోంది. అందులో భాగంగా రెండోదశ టెలిమెట్రీ వ్యవస్థ అమలు కోసం అత్యవసరంగా నిధులు అవసరమని ఇదివరకే ఇరు రాష్ట్రాలకు లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ మూడో కిలోమీటరు వద్ద, కేసీ కెనాల్‌తో పాటు నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాలువ, ప్రకాశఽం బ్యారేజీ వెస్ట్‌ మెయిన్‌ కెనాల్‌, పోలవరం రైట్‌ కెనాల్‌ కన్‌ఫ్లూయన్స్‌, పాలేరు అప్‌స్ట్రీమ్‌, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద టెలిమెట్రీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.6.25 కోట్లతో పరిపాలనపరమైన అనుమతి కూడా ఇచ్చారు. రానున్న నెల నుంచి జీతభత్యాలకు చిల్లి గవ్వ కూడా లేకపోవడం.. బోర్డు కార్యకలాపాలకు నిధుల కొరత వంటి అంశాల నేపథ్యంలో తక్షణమే సింగిల్‌ ఎజెండాతో సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈనెల 20న జరిగే సమావేశంలో నిధుల కోసం బోర్డు పట్టుబట్టే అవకాశం ఉంది.

Updated Date - Apr 06 , 2024 | 03:26 AM