ఆయుధాలతో పోలీసులకు ప్రత్యేక అనుబంధం
ABN , Publish Date - Oct 10 , 2024 | 11:40 PM
పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని జోగుళాంబజోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు.
- పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ చేసిన డీఐజీ, ఎస్పీ
మహబూబ్‌నగర్, అక్టోబరు 10 : పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని జోగుళాంబజోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు గురువారం ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకితో కలిసి జోగుళాంబజోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ప్రత్యేకంగా అలంకరించిన ఆయుధాలు, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని, పోలీసు వ్యవస్థలో ప్రతీవ్యక్తి ఆయుధాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మనిషిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసే వాహనాలకు అంతే ప్రాధాన్యత ఉంటుందని, అందుకే ప్రతీఏటా విజయదశమి సందర్భంగా ఆయుధపూజను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బి డీఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఆర్‌ఐ కృష్ణయ్య, ఎంటీఓ నగేశ్, డీటీసీ ఆర్‌ఐ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.