Share News

Sonia from Khammam! : ఖమ్మం నుంచి సోనియా!

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:36 AM

కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు.

Sonia from Khammam! : ఖమ్మం నుంచి సోనియా!

తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీకి సరేనన్న సోనియా.. రాష్ట్ర నేతలకు సమాచారం

ఆమె తరఫున రేవంత్‌, భట్టి నామినేషన్‌

తెలంగాణ, కర్ణాటకల్లో సోనియా ప్రభావం

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీగా మార్చే వ్యూహం

రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు

గెలుచుకుంటే కేంద్రంలో అధికారం!

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని

కాంగ్రెస్‌ అధిష్ఠానం అంచనా

సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ?

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేసే విషయమై స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్‌సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. సోనియా హాజరైన తుక్కుగూడ సభ తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు బలంగా తీసుకువెళ్లగలిగారు. ఈ నేపథ్యంలోనే సోనియా బ్రాండ్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ గట్టిగా ఉపయోగించాలన్న చర్చ రాష్ట్ర పార్టీలో వచ్చింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపారు. తాజాగా బుధవారం జరిగిన టీపీసీసీ సమావేశంలోనూ ఈ అంశంపై మరోసారి చర్చ జరిగింది. అందులో భాగంగానే సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మరోసారి తీర్మానం చేశారు. రెండోసారి తీర్మానం తర్వాత సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందినట్లు తెలిసింది. రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించాలని సూచించారని సమాచారం. ఢిల్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.

రాష్ట్రంలో పాతుకుపోయేందుకు

సోనియాగాంధీ పోటీ చేయడానికి రాష్ట్రంలోని పలు లోక్‌సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం ఎంపికలో పలు అంశాలు పని చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్‌ చాలాబలంగా ఉంది. నియోజవర్గ గత ఎన్నికల చరిత్రను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. కొత్త రాష్ట్రంలో అధికారంలో పాతుకుపోయేందుకు ఉద్దేశించిన బలమైన రాజకీయ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర పార్టీ నేతలు సోనియాగాంధీని ఇక్కడ రంగంలో దించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్‌ సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మరింత సుస్థిరంగా ఉండాలంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవాలి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో 12కు పైగా గెలిస్తే గత నెల రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో అధికారానికి వచ్చిన పార్టీ మరింత దూకుడుగా పాలనను సాగించగలదు. అన్ని రకాల ఒత్తిడులు తట్టుకొని తన ఎజెండాను అమలు చేయగలదు. తమ కష్టానికి సోనియాగాంధీ లాంటి అగ్రనేతలు పోటీ చేయడం తోడైనపుడు మాత్రమే ఇలాంటి విజయాలు సాధించగలమని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయడానికి సంబంధించిన నామినేషన్‌ పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దాఖలు చేస్తారని సమాచారం. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సభకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.

ఢిల్లీకి దగ్గరి దారి

ఒకప్పుడు ఢిల్లీకి యూపీ దగ్గరి దారి అనేవారు. యూపీలో కాంగ్రెస్‌ నామమాత్రం అయినప్పటికీ 2004లో 145 సీట్లు సాధించి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవంతో కాంగ్రెస్‌ దక్షిణాదిని ఢిల్లీకి దగ్గరిదారిగా భావిస్తోంది. కేంద్రంలో హంగ్‌ ఏర్పడితే బీజేపీయేతర సంకీర్ణానికి నేతృత్వం వహించగల సంఖ్యలో సీట్లు సాధించడం తెలంగాణ, కర్ణాటకల్లో భారీ విజయాల వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. అందుకే, తెలంగాణలో సోనియాగాంధీ పోటీ చేయడం ద్వారా తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విజయాలను ప్రభావితం చేయగలరని ఆశిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 109 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో కలిపి 45 స్థానాలున్నాయి. తెలంగాణలో సోనియాగాంధీ పోటీ చేయడం ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ మూడ్‌ తీసుకురావచ్చని, దాంతో ముస్లిం, ఇతర సెక్యులర్‌ శక్తులను చీలకుండా కాంగ్రెస్‌ వైపు మొగ్గేట్లు చేయవచ్చని, తద్వారా రెండు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలిచి, కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే లీడ్‌ చేయగల స్థాయిలో లోక్‌సభ స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దక్షిణాది నుంచి రెండోసారి!

సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి సోనియాగాంధీ పోటీచేసి బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. తర్వాత మళ్లీ పాతికేళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Updated Date - Jan 05 , 2024 | 03:36 AM