Share News

ఎస్‌ఎన్‌డీపీ పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:11 PM

మున్సిపాలిటీల్లో జరుగుతున్న నాలా పనులకు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు.

ఎస్‌ఎన్‌డీపీ పనులను వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శశాంక

జిల్లా కలెక్టర్‌ శశాంక

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 12 : మున్సిపాలిటీల్లో జరుగుతున్న నాలా పనులకు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి మున్సిపల్‌ కమిషనర్లతో రాష్ట్ర స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఎస్‌ఎన్‌డీపీ) పనుల వేగవంతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, జల్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న ఎస్‌ఎన్‌డీపీ పనులను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నాలా ప్రాజెక్టు కింద జరుగుతున్న పలు కాలువ పనులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రణాళికలు తయారు చేసి వాటి వివరాలు అందజేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని నాలా పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే స్థానికులకు ముంపు సమస్య ఉండదని, ప్రాణనష్టం వంటివి వాటిల్లకుండా ఉంటుందన్నారు. వచ్చే వర్షాల ద్వారా పౌరులు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రమాదాలను నివారించడానికి సైట్ల వెంట హెచ్చరిక బోర్డులు, మొబైల్‌, మినీ మొబైల్‌ స్టాక్‌ టీములను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. నాలా పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారి యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసినా పనులకు అంతరాయం కలగకుండా కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో సూరజ్‌ కుమార్‌, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, జల్‌పల్లి మున్సిపల్‌ కమిషన్లర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:11 PM