Share News

TS News: రూ.1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:15 AM

ఉమ్మడి ఏపీలో (1956-2014 వరకు) అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి కల్పన కోసం రూ.54,021 కోట్లను వెచ్చించి 57.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాయి. కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకూ ఏకంగా

TS News: రూ.1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే

సాగునీటి రంగంలో పదేళ్లలో పరిస్థితి ఇదీ

రూ.1.82 లక్షల కోట్ల వ్యయంతో

తడిసింది 17.24 లక్షల ఎకరాలే

ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై

చేసిన వ్యయం రూ.54,021 కోట్లు

కొత్తగా సాగులోకి 57.87 లక్షల ఎకరాలు

రూ.93,872 కోట్ల ఖర్చు చేసిన

కాళేశ్వరంతో 98 వేల ఎకరాలకే సాగునీరు

నీటిపారుదలశాఖపై సర్కారు శ్వేతపత్రం?!

వివరాలు సేకరించిన ‘ఆంధ్రజ్యోతి’

అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల!

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో (1956-2014 వరకు) అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి కల్పన కోసం రూ.54,021 కోట్లను వెచ్చించి 57.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాయి. కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకూ ఏకంగా రూ.1,82,607 కోట్లు ఖర్చు చేసి 17.24 లక్షల ఎకరాలను మాత్రమే కొత్తగా సాగులోకి తీసుకొచ్చింది. అంటే, ఖర్చు మూడు రెట్ల కన్నా ఎక్కువ. ఫలితం మాత్రం మూడోవంతు కన్నా తక్కువ. అంతేకాదు, కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల కింద రూ.93,872 కోట్లు ఖర్చు చేసి 98వేల ఎకరాల కొత్త ఆయకట్టుకే నీరిచ్చారని, అది కూడా ఇదివరకే ఉన్న చెరువుల కింద నీళ్లిచ్చిన ఆయకట్టేనని తెలుస్తోం ది. మరో కీలకపథకం పాలమూరు-రంగారెడ్డి కింద రూ. 37,514 కోట్లు, సీతారామ ఎత్తిపోతల-సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు కింద రూ.8,634 కోట్లు ఖర్చుపెట్టగా... కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలేదని వెల్లడైంది. తద్వా రా గత పదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని భూములకు నీళ్లివ్వడానికి కాకుండా సంపాదన కోసమే చేపట్టారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నీటిపారుదల శాఖపై వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రూపొందిస్తోంది. దీంట్లో పొందుపర్చిన వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. ఆ వివరాలివీ..

28390 బిల్లులు... 14,913 కోట్ల బకాయిలు

నీటిపారుదల శాఖ మీద రూ.14,913 కోట్ల బకాయిల భారం ఉంది. అంత మొత్తాన్ని ఆ శాఖ వివిధ నిర్మాణ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. వీటికి సంబంధించిన 28,930 బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటిలో రూ.కోటి లోపు బిల్లులే 27,761 ఉండటం గమనార్హం. వీటికి చెల్లింపులు రూ.383 కోట్లు. రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల దాకా 309 బిల్లులు పెండింగ్‌లో ఉండగా... వాటి బకాయిలు రూ.595 కోట్లు, ఇక రూ.5 కోట్లు, ఆ పైన మొత్తాలకు 377 బిల్లులు ఉండగా... వీటి చెల్లింపులకు సంబంధించిన బకాయిలు రూ.13,935 కోట్లని గుర్తించారు. కేవలం పనులకు సంబంధించిన బిల్లులే రూ.9,543 కోట్ల దాకా ఉండగా... కాళేశ్వరంతో పాటు తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ రుణాలకు సంబంధించి అసలు, వడ్డీలు కలిపి రూ.4,192 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందని తేల్చారు.

అప్పులు రూ.98,391 కోట్లు

వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.1,21,697 కోట్ల రుణం పలు సంస్థల నుంచి మంజూరు కాగా... ఇప్పటి వరకూ రూ.98,391 కోట్ల మొత్తం విడుదలైంది. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేశారు. కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్ల రుణం తీసుకున్నారు. ఇప్పటికీ రూ.66,969కోట్ల అప్పు మిగిలి ఉంది. ఇక పాలమూరు-రంగారెడ్డికి కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రూ. 10 వేల కోట్లను రుణం తీసుకోగా... ఇంకా రూ.7,722 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక నాబార్డు నుంచి రూ. 2,014 కోట్లు మంజూరుకాగా... రూ.1613 కోట్లు విడుదల అయ్యాయి. మరో 401 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇలా మొత్తం 98,391 కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి.

ఈసారి జాగ్రత్త పడిన ప్రభుత్వం

ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంధన శాఖలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను, ఇంధనశాఖ శ్వేతపత్రం తయారీ బాధ్యతలను గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులకే అప్పగించటంతో వారు గత ప్రభుత్వానికి వంతపాడే విధంగా వాటిని రూపొందించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి ప్రభుత్వం జాగ్రత్త పడింది. వాస్తవాలను వెలికితీసేలా చర్యలు చేపట్టింది. కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇంధన శాఖలపై తయారు చేసిన శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయగా... ప్రస్తుత నీటిపారుదల శాఖ శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సమావేశాలకు వారం లేదా పదిరోజుల ముందు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి... ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై స్వల్పకాలిక చర్చను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కాళేశ్వరంపై కాగ్‌ కూడా పూర్తిగా లెక్కలు తీసి... నివేదికను జనవరి 29న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికను కూడా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రాజెక్టుల్లోని లోపాలన్నింటిపై సమగ్రంగా విచారణ జరిపింది కాగ్‌. దీంతో అటు కాగ్‌ నివేదిక, ఇటు శ్వేతపత్రంతో సాగునీటి రంగంలోని వాస్తవాలు రాష్ట్ర ప్రజానీకం ముందు వెల్లడవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Feb 01 , 2024 | 10:00 AM