Share News

గుట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:44 AM

యాదగిరిక్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి అనుబంధ శివాలయంలో ఈ నెల 9 నుంచి చేపట్టిన వసంతోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం కమనీయంగా నిర్వహించారు.

గుట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం
సీతారాముల కల్యాణం

భువనగిరి అర్బన్‌, ఏప్రిల్‌ 17: యాదగిరిక్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి అనుబంధ శివాలయంలో ఈ నెల 9 నుంచి చేపట్టిన వసంతోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం కమనీయంగా నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా నిత్యారాధనల అనంతరం అభిషేకం, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, స్వామిఅమ్మవార్లకు అష్టోత్తర శతనామార్చనలు చేశారు. వేదపండితులు, పురోహితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా స్వామిఅమ్మవార్లను వజ్ర వైఢూర్యాలతో అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠించి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. రాత్రి వేళ హనుమాన్‌మూర్తులకు సహస్రనామార్చనలు, నివేదన నీరాజనం, మంత్ర పుష్పాలు, వేదపండితులు, పురోహితులు, అర్చకులు తీర్థప్రసాద వితరణ చేయగా కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి దంపతులు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో దూశెట్టి కృష్ణ, పర్యవేక్షకుడు రామారావు, పూజారి దోర్భల శ్రీధరశర్మ, ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా నిత్య పూజలు

యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో బుధవారం నిత్యకైంకర్యాలు భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠామూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించి తులసీదళాలతో సహస్రనామార్చన చేశారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవార్లను ముగ్దమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్భారు సేవోత్సవం చేపట్టిన అర్చకులు అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు చేశారు. పాతగుట్ట ఆలయంలో నిత్య కైంకర్యాలు వైభవంగా జరిగాయి. అదేవిధంగా కొండపై శివాలయంలో శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12,15,058 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 12:44 AM