Share News

తెలంగాణపై కమలం గురి!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:13 AM

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం

తెలంగాణపై కమలం గురి!

ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం.. నేడు సిద్దిపేట బహిరంగ సభకు షా

30న, వచ్చే నెల 3, 4 తేదీల్లో మోదీ పర్యటన.. త్వరలో నడ్డా, యోగి పర్యటించే చాన్స్‌

హైదరాబాద్‌, సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఆయా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలిరానుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రచారం కూడా జోరందుకుంది. ఆయా కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. మలిదశలో భాగంగా ప్రతి మూడు లేదా నాలుగు రోజులకు ఒక భారీ సభ నిర్వహించి సత్తా చాటాలని పార్టీ నిర్ణయించింది. ఈ సభలకు బీజేపీ అగ్ర నేతలు హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు మోదీ, అమిత్‌షా పర్యటన షెడ్యూలు ఇప్పటికే ఖరారు కాగా, నడ్డాతోపాటు సీనియర్‌ నేతలు నితిన్‌ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటనలు ఒకటి, రెండు రోజుల్లో ఖరారు కానుంది. రాష్ట్రంలో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30న ప్రధాని జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆంధోల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం, శేరిలింగంపల్లి పరిధిలోని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మే 3న వరంగల్‌ పార్లమెంటు పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అలాగే, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల కోసం సంయుక్తంగా నిర్వహించే మరో సభకూ హాజరవుతారు. 4న నారాయణపేట, వికారాబాద్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం సిద్దిపేటకు రానున్నారు. మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11.10 గంటలకు హైదారాబాద్‌ బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్‌ షా అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11.45కు సిద్దిపేట కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో షా పాల్గొంటారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను రఘునందన్‌రావు బుధవారం స్వయంగా పరిశీలించారు. కాగా, కొన్ని రోజుల కిందట మల్కాజ్‌గిరి పరిధిలో ప్రధాని మోదీ భారీ రోడ్డు షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలాంటి రోడ్డు షో మరొకటి నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించగా.. జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

Updated Date - Apr 25 , 2024 | 04:13 AM