Share News

అనారోగ్య టెకీలు!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:48 AM

మీరు ఐటీ ఉద్యోగులా? మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా? తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకంటే.. ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు.. వారి హెల్త్‌ పారామీటర్స్‌ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్‌సీఎల్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ

అనారోగ్య టెకీలు!

ఐటీ ఉద్యోగుల్లో 61% మందిలో హై కొలెస్ట్రాల్‌

37 శాతం మందిలో ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత

పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయులు అస్తవ్యస్తం

25-40 లోపు ఉన్న 56 వేల మందిపై అధ్యయనం

8 అంశాలపై హెచ్‌సీఎల్‌ హెల్త్‌ కేర్‌ పరీక్షలు

యాంత్రిక జీవనశైలితో 40 ఏళ్లలోపే ఇబ్బందులు

చాలామందిలో సంతానలేమి: వైద్య నిపుణులు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మీరు ఐటీ ఉద్యోగులా? మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా? తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకంటే.. ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు.. వారి హెల్త్‌ పారామీటర్స్‌ అస్తవ్యస్తంగా ఉన్నట్లు హెచ్‌సీఎల్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా 56వేల మంది ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది వీరిలో 77 శాతం మంది ఆరోగ్య విలువలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్లు తేల్చింది. ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది. క్లినికల్‌ స్టడీ చేసిన తర్వాత హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ ఈ వివరాలు వెల్లడించింది. ఈ స్టడీని 25-40ఏళ్లలోపువారిపై చేశారు. వీరందరికీ వారి పని ప్రదేశాల వద్దే వైద్యు ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు.

దేశంలోని కార్పొరేట్‌ వ్యవస్థల్లో పనిజేసే ఉద్యోగుల్లో పెరుగుతున్న అనారోగ్య పరిస్థితులను నివారించే లక్ష్యాన్ని నొక్కి చెప్పడమే ఈ అధ్యయన ప్రధాన ఉద్దేశమని హెచ్‌ఎ్‌సఎల్‌ పేర్కొంది. ఊబకాయం, ప్రిడయాబెటీస్‌, డయాబెటీస్‌, ప్రి హైపర్‌టెన్షన్‌, రక్తపోటు, రక్తహీనత, హైపోథైరాయిడిజమ్‌, అధిక కొవ్వులాంటి కీలకమైన 8 అంశాలను పరీక్షించారు. ఉద్యోగుల్లో 22% మంది ఊబకాయం, 17% ప్రి డయాబెటి్‌సతో, 11% రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7% మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది. ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరూ ఒకటికంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యవస్తంగా ఉన్నట్లు, వీరిలో 14% రక్తహీనతతో, 13% ఊబకాయంతో, 8% హైపోథైరాయిడిజంతో, 7% ప్రిడయాబెటీ్‌సతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. ఇలాం టి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అధ్యయన సంస్థ తెలిపింది. వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు పెరిగే అవకాశాలున్నాయని.. ప్రధానంగా 40ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకరస్థితిలో ఈ పారామీటర్స్‌ పెరుగుతున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా అధిక కొవ్వు, ఊబకాయం, ప్రి డయాబెటీస్‌, డయాబెటీస్‌ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్‌ పారామీటర్స్‌ తగిన స్థాయిల్లో ఉన్నాయని వెల్లడించింది. ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26% మందిలో రెండు, 11% మందిలో 3రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్లు తెలిపింది. సాధారణంగా నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ)లన్నీ కూడా 40ఏళ్ల తర్వాతే వస్తుంటాయి. కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రం అవి 30ఏళ్లలోపే కనిపిస్తున్నాయి, ఇందుకు ప్రధాన కారణం వారి జీవనశైలేనని హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ సీఈవో, వైస్‌ చైర్మన్‌ షికర్‌ మల్హోత్రో పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు తప్పక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్‌ ఫుడ్స్‌, రెడీమేడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తీసుకుంటున్నారని, అలాగే గంటల కొద్దీ ఒకేచోట కదలకుండా కూర్చోవడం, జీవనశైలి విధానం వల్ల కూడా వారిలో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయని యశోద ఆస్పత్రికి చెందిన ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు డాక్టర్‌ రాయిడి గోపీ కృష్ణ తెలిపారు.

ఐటీ ఉద్యోగుల్లో సంతానలేమి సమస్య తీవ్రం

ఐటీ ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవన శైలిని గడుపుతున్నారు. రివర్స్‌ టైమ్‌లో పనిజేస్తుంటారు. అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వారి ఉద్యోగ స్థితే అందుకు కారణం. రేయింబవళ్లు పని, వ్యాయామం లేకపోవడం, సరైన డైట్‌ పాటించకపోవడం, స్మోకింగ్‌, మద్యపానం, సరిగానిద్రపోకపోవడం లాంటివాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. హెచ్‌సీఎల్‌ అధ్యయనం కంటే కూడా ఇంకా ఎక్కువ సమస్యలే వారిలో ఉన్నాయి. ఇటీవలికాలంలో వారిలో సంతానలేమి సమస్య తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇది బాగా ఆందోళనకరమైన అంశం. అందుకే 25 రాకముందే ఏటా విధిగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. బీపీ, షుగర్‌ను కనీసం 6 నెలలకొకమారైనా చెక్‌ చేయించుకోవాలి. ఐటీ కంపెనీల యాజమాన్యాలుసైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి. దాంతో ముందస్తుగా వారి ఉద్యోగుల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు. తద్వారా వారి బీమా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

- డాక్టర్‌ ఎం.వీ.రావు. సీనియర్‌ కన్సల్టెంట్‌

జనరల్‌ ఫిజిషియన్‌, యశోద ఆస్పత్రి, హైదరాబాద్‌.

Updated Date - Mar 26 , 2024 | 03:48 AM