Share News

ఎస్‌ఐబీ మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:37 AM

సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీలోని మాజీ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఎస్‌ఐబీ మాజీల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుపై లుక్‌ఔట్‌ నోటీసు

ఇద్దరు అదనపు ఎస్పీల విచారణ.. అరెస్టు

2 గదుల్లో ట్యాపింగ్‌.. విదేశీ టెక్నాలజీ వాడకం

ప్రణీత్‌రావు విచారణలో కీలక ఆధారాల సేకరణ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీలోని మాజీ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ట్యాపింగ్‌ కుట్రలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహా మొత్తం 8 మంది పోలీసు అధికారులు, ఓ మీడియా సంస్థ యజమాని, పలువురు రాజకీయ నేతలు భాగస్వాములని విచారణాధికారులు గుర్తించారు. కస్టడీలోని ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారంతో వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో 10 బృందాలు ప్రభాకర్‌రావు ఇంటితో పాటు.. మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌కుమార్‌ రావు ఇంట్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించాయి. పలు కీలక ఆధారాలు సేకరించాయి. శ్రవణ్‌ రావు నివాసంలో 2 ల్యాప్‌టా్‌పలు, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, 1 హార్డ్‌డిస్క్‌, డీవీఆర్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే కేసు ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆలోచనతో ముందే ప్రభాకర్‌రావు అమెరికాకు.. శ్రవణ్‌ రావు లండన్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్టు..

ఈ కేసులో గతంలో ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న, ఇంటెలిజెన్స్‌ టాప్‌ సీక్రెట్‌ వింగ్‌లో చేసిన మరో అదనపు ఎస్పీ భుజంగరావును శనివారం వేర్వేరుగా అదుపులోకి తీసుకొని ఆరేడు గంటల పాటు విచారించారు. వీరి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం భుజంగరావు భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులపై ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి వారికి సంబంధించిన ప్రొఫైల్‌ తయారు చేశామని, అందుకు సంబంధించిన సాక్షాలను నాశనం చేశామని తిరుపతన్న, భుజంగరావు విచారణలో అంగీకరించారు. దీంతో వీరిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా బీఆర్‌ఎ్‌సకు చెందిన డబ్బులను వీరిద్దరే వాహనాల్లో తరలించారని విచారణలో తేలింది. అలాగే గతంలో ఎస్‌ఐబీలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయ్‌.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరై ఇప్పటికే తన వాంగ్మూలాన్ని ఇచ్చి వెళ్లారు. ఆ తర్వాత వరంగల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ప్రణీత్‌రావు బ్యాచ్‌మెట్స్‌ సైతం విచారణకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఇక గత పాలకుల మెప్పు కోసం, వారికి రాజకీయ లబ్ధి కలిగించేందుకే పోలీసు అధికారులు ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రకు పాల్పడినట్లుగా విచారణాధికారులు గుర్తించారు. ఈ కుట్రలోని పాత్రధారులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి లబ్ధి పొందిన నేతలెవరనేది ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఇందులో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు నేతల ప్రమేయమున్నట్లుగా తెలిసింది.

విదేశీ టెక్నాలజీ సాయంతో..

ఇక 2018లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌ హోదాలో చేరిన ప్రణీత్‌రావుకు ఫోన్‌ ట్యాపింగ్‌ కోసం 2 గదులు, 17 కంప్యూటర్లతో పాటు.. ప్రత్యేక అధికారాలు కట్టబెట్టినట్లు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్ర అంతా ఆ రెండు గదుల్లోంచి మాత్రమే జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు.. విదేశాల నుంచి తెచ్చిన అధునాతన టెక్నాలజీని ఇందుకోసం వాడినట్లు గుర్తించారు. అయితే సాంకేతిక పరికరాలకు అయిన ఖర్చును ప్రభుత్వ నిధుల నుంచి భరించారా..? లేక ప్రధాన సూత్రధారులే భరించారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రణీత్‌రావుకు ఏడు రోజుల కస్టడీ ముగియడటంతో ఆదివారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 02:37 AM