మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:30 AM
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు.
గుండ్లపోచంపల్లిలోని హెచ్‌ఎండీఏ లేఔట్‌లో వేసిన రహదారి తొలగింపు
1045 గజాల ఆక్రమణ, కళాశాలకు రోడ్డు నిర్మాణం
నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు
ఇటీవల లేఔట్ సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో చర్యలు
మేడ్చల్, మార్చి2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. మైసమ్మగూడ పరిధిలోని హెచ్‌ఎండీఏ లేఔట్ పార్కు స్థలం నుంచి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వరకు గతంలో అక్రమంగా నిర్మించిన సీసీ రోడ్డును శనివారం తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఈ రహదారిపై ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు స్పందించలేదు. అయితే, లేఔట్ సొసైటీ సభ్యులు ఇటీవల సీఎంవోను ఆశ్రయించారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి రహదారి, రహదారి పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.
మైసమ్మగూడ సర్వే నెంబర్ 523, 524లో కమలానగర్ పేరిట హెచ్‌ఎండీఏ లేఔట్ ఏర్పాటు చేశారు. అందులోని 3 వేల చదరపు గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. ఈ స్థలం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు ఆనుకొని ఉంటుంది. దీంతో అప్పట్లో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి.. లేఔట్ సొసైటీ సభ్యులను సంప్రదించి 60 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం పార్కు స్థలం ఇవ్వాలని అడిగారు. బదులుగా పక్కన ఉన్న సర్వే నెంబర్ 522లోని తన స్థలాన్ని ఇస్తానని ప్రతిపాదించారు. దీనికి సొసైటీ సభ్యులు తిరస్కరించారు. దీంతో మల్లారెడ్డి.. ఓ రోజు రాత్రికి రాత్రే తన సొంత ఖర్చులతో పార్కు మధ్య నుంచి 60 అడుగుల వెడల్పు, 90 అడుగుల పొడవున రహదారి నిర్మించారు. అంతేకాక, రోడ్డు కోసం తీసుకున్న 1045 చదరపు గజాలకు బదులుగా సర్వే నెంబర్ 522లోని 1210 చదరపు గజాల స్థలాన్ని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై సొసైటీ వాసులు అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం రాగా ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నాలుగేళ్లుగా తొక్కిపెట్టారు. సొసైటీ సభ్యులు ఇటీవల సీఎంవోను ఆశ్రయించగా అధికారులు ్ట రహదారి, రహదారి పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు.
ఇది ప్రభుత్వ కక్ష సాధింపు : ఎమ్మెల్యే మల్లారెడ్డి
ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. హెచ్‌ఎండీఏ అనుమతితోనే తాను రోడ్డు వేసినట్లు స్పష్టం చేశారు.