Share News

Sharmila : రేపే కాంగ్రెస్‌లోకి షర్మిల

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:09 AM

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల కాంగ్రె్‌సలో చేరిక ఖరారైంది.

Sharmila : రేపే కాంగ్రెస్‌లోకి షర్మిల

రాహుల్‌, ఖర్గే సమక్షంలో చేరనున్న వైఎస్‌ కుమార్తె.. నేడు సాయంత్రం ఢిల్లీకి

లోటస్‌పాండ్‌లో వైఎస్సార్టీపీ ముఖ్యులతో సమావేశం.. కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత

తనకు ఏఐసీసీలో చోటు, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు ఇస్తారని వెల్లడి

తెలంగాణలో మా పార్టీ పోటీ చేయనందునే హస్తం పార్టీకి అధికారం దక్కింది

కాంగ్రెస్‌తో పనిచేయాలని ఇదివరకే నిర్ణయం.. నాతో నడుస్తానన్న ఆళ్లకు ధన్యవాదాలు

ఇడుపులపాయలో షర్మిల.. వైఎస్‌ సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం

వేంపల్లె-హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల కాంగ్రె్‌సలో చేరిక ఖరారైంది. గురువారం కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె ఆ పార్టీలో చేరనున్నారు. వైఎ్‌సఆర్‌టీపీని కాంగ్రె్‌సలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తారు. ఇందుకోసం ఆమె బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. వైఎ్‌సఆర్‌టీపీ ముఖ్యనాయకులు వాడుక రాజగోపాల్‌, తూడి దేవేందర్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి తదితరులూ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. షర్మిల మంగళవారం లోట్‌సపాండ్‌లోని వైఎస్సార్టీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేస్తున్నట్లు వారికి స్పష్టత ఇచ్చారు. ఏఐసీసీలో కీలక పదవి, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ బాధ్యతలు తనకిచ్చే అవకాశం ఉందనీ వారికి తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యనాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించాలని, ఊగిసలాట వద్దని తూడి దేవేందర్‌రెడ్డి సూచించారు. ఊగిసలాట ఉండదని, విలీనం తర్వాత కాంగ్రెస్‌ ఇచ్చిన బాధ్యత స్వీకరించి పోరాటానికి సిద్ధపడతానని షర్మిల పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లేదా నల్లగొండ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒకరిద్దరు నేతలు సూచన చేశారు. సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు. తన వెంట నడుస్తానని ప్రకటించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆమె ఇడుపులపాయ బయల్దేరి వెళ్లారు.

చేరికపై ఇదివరకే నిర్ణయం: షర్మిల

కాంగ్రె్‌సలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై ఇది వరకే నిర్ణయం తీసుకున్నానని షర్మిల తెలిపారు. ఇడుపులపాయలోని వైఎ్‌సఆర్‌ ఘాట్‌ వేదికగా సెక్యులర్‌ పార్టీ అయిన కాంగ్రె్‌సతో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. మంగళవారం వైఎ్‌సఆర్‌ ఘాట్‌ను షర్మిల, ఆమె తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, కుమార్తె అంజలి, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ, ఆమె తల్లిదండ్రులు అట్లూరి శ్రీనివాస్‌, మాధవితో కలిసి సందర్శించారు. కుమారుడి వివాహ పత్రికను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద ఉంచారు. సమాధి వద్ద, ఘాట్‌ ఆవరణలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని తండ్రి చెంతకు వచ్చామని, ఆయన ఆశీర్వాదం తీసుకున్నామని షర్మిల అన్నారు. కాంగ్రె్‌సలో పనిచేయాలని ఇదివరకే నిర్ణయించామని, తెలంగాణలో కాంగ్రె్‌సకు తాము మద్దతివ్వడం వల్లే అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎ్‌సఆర్‌టీపీ చాలా పెద్దపాత్ర పోషించిందని.. 31 నియోజకవర్గాల్లో కాంగ్రె్‌సకు 10 వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని, తాము పోటీచేయకపోవడమే దీనికి కారణమని తెలిపారు. తాము పోటీ చేసి ఉంటే కాంగ్రె్‌సకు ఇబ్బంది తలెత్తేదని, తమ పార్టీ, తాను చేసిన త్యాగానికి విలువిచ్చి.. కాంగ్రెస్‌ ఆహ్వానించిందన్నారు. ‘ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ. ప్రజల భద్రత కోసం పనిచేసే పార్టీని బలపరచాలని నిర్ణయించాం. బుధవారమే ఢిల్లీ వెళ్తున్నా. ఒకట్రెండు రోజుల్లో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది’ అని చెప్పారు. కాంగ్రె్‌సలో చేరాక షర్మిల విజయవాడ రానున్నారు. ఆమె సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులతో కలసి పార్టీలో చేరతారు.

Updated Date - Jan 03 , 2024 | 03:11 AM