Share News

Settlements : ఏ‘ఛీ’పీలు..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:04 AM

హైదరాబాద్‌ నగర శివార్లలోని కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధులు దాటుతున్నారు. భూవివాదాల్లో తలదూర్చి, తమదైన శైలిలో సెటిల్‌మెంట్లు చేసేస్తున్నారు.

 Settlements : ఏ‘ఛీ’పీలు..!

భూ దందాల్లో బాగా బిజీ

పోలీసు అధికారుల సెటిల్‌మెంట్లు

హైదరాబాద్‌ శివార్లలో ఇద్దరు

ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ

సర్కారు మారినా వారిదే ‘హవా’

మితిమీరుతున్న కొందరు అధికారులు

అప్పటి కీలక మంత్రి ఆశీస్సులతో పోస్టింగ్‌

వారిని ఇంకా కాపాడుతున్నదెవరు?

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): హైదరాబాద్‌ నగర శివార్లలోని కొందరు పోలీసు ఉన్నతాధికారులు పరిధులు దాటుతున్నారు. భూవివాదాల్లో తలదూర్చి, తమదైన శైలిలో సెటిల్‌మెంట్లు చేసేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, కొందరు అధికారుల తీరు మాత్రం మారలేదు. ఇటీవలే సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న మొయినాబాద్‌, మోకిలా ఇన్‌స్పెక్టర్లపై కమిషనర్‌ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా శివార్లలో కొందరు పోలీసు అధికారులు మాత్రం భూ దందాలు చేస్తూనే ఉన్నారు. పలుచోట్ల ఏసీపీ, ఆ పైస్థాయి అధికారులు ఇన్‌స్పెక్టర్లను డమ్మీలు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగర శివార్లలో ఇలాంటి దందాలు చేస్తున్న ఇద్దరు ఏసీపీల వ్యవహారశైలిపై విస్తృత చర్చ సాగుతోంది.

ఆ ఏసీపీ దందా స్టైలే వేరు..!

ఓఆర్‌ఆర్‌కు ఆనుకొని ఉన్న ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏసీపీ.. రెవెన్యూ వ్యవస్థను కూడా శాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ఆశీస్సులతో ఇక్కడ పోస్టింగ్‌ పొందిన సదరు ఏసీపీ.. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతుండడం గమనార్హం. ఆయన ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలోని రెండు మండలాల్లో భూవివాదాల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. ఈ విషయంపై పోలీసు పెద్దలకు సమాచారం ఉన్నా, ఆయనపై చర్యలకు సాహసించడం లేదు. పోలీసు కీలక ఉన్నతాధికారి తనకు గాడ్‌ ఫాదర్‌ అని ప్రచారం చేసుకుంటుడడంతో ఆయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. అంతేకాదు భూవివాదాల్లో ఓ రౌడీషీటర్‌ను తెరవెనక వాడుకుంటున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో పోస్టింగ్‌ పొందిన ఆయన, ఇక్కడ స్థిరపడేందుకు తన సామాజికవర్గం పేరును బాగానే వాడేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు జరిగిన ఓ ఉపఎన్నికలో అప్పటి అధికార పార్టీ తరఫున బరిలో దిగేందుకు తహతహలాడారు. ఆ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అప్పటి అధికార పార్టీ రాజకీయ నేతకే టికెట్‌ ఇచ్చింది. ఆయన స్వామి భక్తికి నజరానాగా నగర శివార్లలో కీలకమైన ప్రాంతంలో పోస్టింగ్‌ ఇచ్చింది. అలా అప్పటి పెద్దల ఆశీస్సులతో పోస్టింగ్‌ తీసుకున్న ఆయన తన పరిధిలో పెదరాయుడిగా చెలామణీ అవుతున్నారు. ప్రభుత్వం మారినా.. ఆయన హవా మాత్రం తగ్గలేదు. తన పరిధిలో విచ్చలవిడిగా భూదందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కోర్టులో ఉన్న ఓ సివిల్‌ కేసు విషయంలో తలదూర్చి ఓ వర్గానికి అనుకూలంగా సెక్షన్‌ 145 కింద కేసు నమోదు చేయించారు. సాధారణంగా కోర్టులో ఉన్న భూవివాదానికి సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయరు. కానీ, ఆయన రెవెన్యూ అధికారులపై వత్తిడి తెచ్చి లా అండ్‌ ఆర్డర్‌ పేరుతో రెండేళ్లుగా కోర్టులో కొనసాగుతున్న భూవివాదంలో సెక్షన్‌ 145 కింద కేసు పెట్టించారు. ఇందులో ఆయన భారీగా ముడుపులు అందుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవల ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భూవివాదంలో కూడా ఇలానే తలదూర్చి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడమే కాక, పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపే ప్రయత్నం చేశారు. నగర సమీపంలోని ఓ గ్రామంలో కొన్ని దశాబ్దాల కిందట రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. ధరణిలోని లోపాలు అడ్డుపెట్టుకుని గ్రామసర్పంచి ఈ భూమికి పాస్‌బుక్‌ సంపాదించారు. ఆ పాస్‌బుక్‌ను ఆసరాగా చేసుకున్న ఆ సర్పంచి, పక్కనే ఉన్న మరొకరి భూమిని కబ్జాపెట్టారు. రైతు అయిన ఆ భూమి అసలు యజమాని పోలీసులను ఆశ్రయిస్తే.. ‘సివిల్‌ కేసు. కోర్టుకు వెళ్లాలి’ అంటూ వెనక్కి పంపించేశారు. పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో సదరు సర్పంచి విలువైన మూడెకరాల భూమిని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఏసీపీ అండదండలతోనే ఇదంతా జరిగినట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. పక్కనే ఉన్న మరో గ్రామంలో కూడా ప్లాట్ల యజమానులకు, వెంచర్‌ వేసిన రియల్‌ వ్యాపారి మధ్య 11 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు రియల్‌ వ్యాపారికి అనుకూలంగా సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెటిల్‌ చేసుకోకుంటే క్రిమినల్‌ కేసులు పెడతామని ప్లాట్ల యజమానులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.

వీరిని కాపాడుతున్నదెవరు?

కొత్త ప్రభుత్వంలో కీలక ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టింగ్‌లు జరుగుతున్న తీరు చూసి అన్ని వర్గాల వారు సర్కార్‌ను మెచ్చుకుంటున్నారు. అనేక కీలక శాఖల్లో సమర్థ అధికారులను నియమించడంతో రేవంత్‌ సర్కార్‌ పాలనను మళ్లీ గాడిలో పెడుతున్నారని భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా ఇలాంటి అవినీతిపరులు అరాచకాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో పోస్టింగ్‌లు పొందిన అనేక మంది ఇంకా తమ హవాను కొనసాగిస్తున్నారు. అప్పటి ఫ్రభుత్వంలో అరాచకాలు చేసిన వీరంతా ఇపుడు కూడా చక్రం తిప్పుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సదరు పోలీసు అధికారులను కాపాడుతున్న వారెవరు? వారి అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎందుకు ప్రభుత్వ ఉన్నతాఽధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. వీరి వెనుక ఉన్న బలమైన అదృశ్య శక్తులు ఎవరు? అని ఉమ్మడి జిల్లాలో చర్చసాగుతోంది.

ఈయన రూటే సెపరేటు!

జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీల పరిధిలోని మరో ఏసీపీ కూడా తానేమీ తక్కువ కానట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన ఆగడాలు మితిమీరుతున్నాయి. ఓ రిటైర్డ్‌ ఎస్పీ భూమిపై కన్నేయడంతో పాటు ఆయన కట్టుకున్న ఇంటిని కూడా ఇతరుల కబ్జాలోకి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈ ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న రిటైర్డ్‌ అధికారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆయన దగ్గర ఉండి మరీ ఇతరులకు పొజిషన్‌ ఇప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు దీనిపై జరుగుతున్న విచారణలో ఆయన తన తప్పేమీ లేదని, ఉన్నతాధికారులు చెప్పడంతోనే జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాగే ఆయన సమీపంలోని ఓ మునిసిపాలిటీ పరిధిలో ఉన్న 2 వేల గజాల స్థలం విషయంలో జోక్యం చేసుకుని తనకు అనుకూలమైన వ్యక్తుల పరం చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

Updated Date - Jan 29 , 2024 | 03:10 AM