Share News

అవిశ్వాస సెగలు..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:24 PM

రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో రాజకీయం వేడిని రగిలిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మున్సిపల్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను పదవిలోకి దించేందుకు సభ్యులు సన్నద్ధమవుతున్నారు. అయితే, వారిపై పెట్టే అవిశ్వాస తీర్మానాల్లో సొంత పార్టీతో పాటు విపక్ష సభ్యులు కూడా ఒక్కటి కావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే సభ్యులు కలెక్టర్‌, ఇతర అధికారులకు తీర్మానాలను కూడా అందించారు. ఇప్పుడు ఆ అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవి కోల్పోయేదెవరో.. కొత్తగా చైర్మన్‌ పీఠాలను అధిరోహించేది ఎవరో అన్న ఉత్కంఠ జిల్లా ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లోనూ నెలకొని ఉంది.

అవిశ్వాస సెగలు..!
బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ మేయర్‌పై అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేస్తున్న సభ్యులు

ఇప్పటికే మూడుచోట్ల అవిశ్వాస నోటీసులు

తుర్కయాంజాల్‌, షాద్‌నగర్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ను తొలగించేందుకు ఏర్పాట్లు

తాజాగా బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటుకు ఎసరు

మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించిన 16 కార్పొరేటర్లు

రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లో రాజకీయం వేడిని రగిలిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మున్సిపల్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను పదవిలోకి దించేందుకు సభ్యులు సన్నద్ధమవుతున్నారు. అయితే, వారిపై పెట్టే అవిశ్వాస తీర్మానాల్లో సొంత పార్టీతో పాటు విపక్ష సభ్యులు కూడా ఒక్కటి కావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే సభ్యులు కలెక్టర్‌, ఇతర అధికారులకు తీర్మానాలను కూడా అందించారు. ఇప్పుడు ఆ అవిశ్వాస తీర్మానాలు నెగ్గి పదవి కోల్పోయేదెవరో.. కొత్తగా చైర్మన్‌ పీఠాలను అధిరోహించేది ఎవరో అన్న ఉత్కంఠ జిల్లా ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లోనూ నెలకొని ఉంది.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 12 : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస సెగలు ఆసక్తి రేపుతున్నాయి. అవిశ్వాస తీర్మానం కోసం అసంతృప్తులు చేస్తున్న రాజకీయం మరింత వేడెక్కుతోంది. గత సర్కార్‌ హయాంలో ఇబ్బందులు పడిన వారంతా ఏకమై అవిశ్వాసాలను తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, స్వతంత్ర సభ్యులంతా కలిసి బల నిరూపణ కోసం సవాల్‌ విసురుతున్నారు. చెర్మన్లు, చైర్‌పర్సన్లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు లాంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మూడు చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరో రెండుచోట్ల నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉన్నప్పటీకీ.. అవిశ్వాస తీర్మానాల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌పై కౌన్సిలర్లు ఆవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24మంది కౌన్సిలర్లకు గాను చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి (కాంగ్రెస్‌)పై 15 మంది, బీఆర్‌ఎస్‌ ఇద్దరు, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపై సంతకాలు చేసి ఈ నెల 8న జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. అలాగే ఆదిభట్ల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ కొత్త ఆర్థిక (కాంగ్రెస్‌), వైస్‌ చైర్మన్‌ కోరె కమలమ్మ (బీఆర్‌ఎస్‌)లపై తోటి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులతో పాటు బీజేపీ సభ్యుడు ఒకరు అవిశ్వాస తీర్మానం ప్రతిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి జిల్లా అదనపు కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌కు నోటీసు అందించారు. అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ (కాంగ్రెస్‌), వైస్‌ చైర్మన్‌ గుండ్లపల్లి హరిత (బీర్‌ఆర్‌ఎస్‌)పై అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీ చెర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. చైర్మన్‌పై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరినట్లు తెలిసింది. దీనికి కూడా ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే షాద్‌నగర్‌లో మున్సిపాలిటీలో 28 వార్డులు ఉన్నాయి. ఇందులో సగం పైగా కౌన్సిలర్లు మున్సిపల్‌ చైర్మన్‌పై అసంతృప్తితో ఉన్నారు. వారంతా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి ప్రకారం ఎమ్మెల్యే కూడా సుముఖత వ్యక్తం చేశారని పలువురు కౌన్సిలర్లు తెలిపారు. త్వరలోనే మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సీటుకు ఎసరు పెట్టారు. మేయర్‌ బుర్ర మహేందర్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు ఎత్తుగడలు వేస్తున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంకను కలిసిన 16మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పత్రాన్ని సమర్పించారు.

Updated Date - Jan 13 , 2024 | 12:04 AM