Share News

నేటి నుంచి బడిబాట..

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:44 PM

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది.

నేటి నుంచి బడిబాట..

బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యం

ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 5 : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన బడి బాట కార్యక్రమంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ బడి బాటలో చిన్నారుల తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరించనున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం, బాలికా విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకు రావటమే లక్ష్యంగా బడి బాట కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం, ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేయాలని నిర్ణయించింది. జిల్లా, మండల విద్యాధికారులు, మండల పరిషత్‌ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించనున్నారు.

కార్యక్రమాలు ఇలా..

6వ తేదీ గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి, బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం, 7న ప్రతి ఇంటిని సందర్శించి పాఠశాలకు వచ్చే పిల్లల జాబితాను సిద్ధం చేయనున్నారు. 8 నుంచి 10వరకు బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించి గ్రామస్థాయిలో రిజిష్టర్‌లో పేరు నమోదు చేయడం, గడప గడప ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బడిబాటపై కరపత్రాలు, బ్యానర్లతో ప్రచారం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలు ఉన్నాయి. 11న గ్రామ సభలు నిర్వహించి, బడిబాట కార్యక్రమాన్ని సమీక్షించడం, బడికి రాకుండా మిగిలిపోయిన పిల్లలను, పాఠశాలల్లో నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తిస్తారు. 12న పాఠశాల సుందరీకరణ, పండుగ వాతావరణం నెలకొల్పడం, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పనులను ప్రారంభించడం, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, డ్రెస్‌ల పంపిణీ, 13న ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాలు, పుస్తకపఠనం, 14న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభలు, క్విజ్‌ పోటీలు నిర్వహించడం, అక్షరాల గుర్తింపు, ప్రాథమిక గణిత కార్యకలాపాలు, 15న దివ్యాంగులను భవిత సెంటర్లలో, బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించడం, విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించడం, 18న డిజిటలైజేషన్‌, ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థులకు అవగాహన, 19న స్పోర్స్‌డే నిర్వహించి, విద్యార్థులకు వివిధ క్రీడల్లో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

బడిబాటను విజయవంతం చేయాలి

బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, తహసీల్దార్లు, ఎంపీపీలు, ఎంపీడీవోలు, హాస్టల్‌ వెల్లేర్‌ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను, సహాయక సంఘాలు, పంచాయతీ కార్యదర్శులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో చదువుకు దూరంగా ఉంటున్న బడీడు పీల్లలను గుర్తించి దగ్గరలోని అంగన్‌వాడీ, పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

- సుశీందర్‌రావు, డీఈవో

Updated Date - Jun 05 , 2024 | 11:44 PM