Share News

Medaram: గద్దెపైకి సారలమ్మ.. నేడే సమ్మక్క తల్లి రాక

ABN , Publish Date - Feb 22 , 2024 | 04:39 AM

డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది.

Medaram: గద్దెపైకి సారలమ్మ.. నేడే సమ్మక్క తల్లి రాక

నేడు వనదేవతల సన్నిధికి కిషన్‌రెడ్డి.. ‘జాతీయ పండుగ’పై ప్రకటన చేస్తారా?

రేపు మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌

జాతరలో భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు.. 9,695 మందికి చికిత్స

పార్కింగ్‌ ఏరియా నుంచి ఉచిత బస్సులేవి?.. మంత్రి చెప్పినా నడవని వైనం

ప్రైవేటు వాహనాలనూ వెళ్లనివ్వని పోలీసులు.. 5 కి.మీ నడిచి వెళ్తున్న భక్తులు

మేడారం జాతర భక్తులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

హనుమకొండ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య.. భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు. రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పగిడిద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు.

మామిడి తోరణాలు కడతారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళతారు. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణ, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ పూజాతంతు అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీని పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఏతెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆట పాటలతో అలరిస్తారు. పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చుంటారు. మంగళహారతులు పడతారు. కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత మేరకు రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరోస్థాయికి చేరుతుంది.

ఐదు కి.మీ నడుచుకుంటూ మేడారానికి..

మేడారం జాతర కోసం పార్కింగ్‌ స్థలాల దాకా వచ్చే భక్తులకు అక్కడి నుంచి ఇబ్బందులెదురవుతున్నాయి. అక్కడి నుంచి మేడారానికి ఐదు కిలోమీటర్ల దూరం!! ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, జీపులు, బైక్‌ల వంటి ప్రైవేటు వాహనాలను పార్కింగ్‌ స్థలాల వరకే పోలీసులు అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి లోపలికి బస్సులు సహా ఏ వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులు మూటాముల్లె నెత్తిన పెట్టుకొని ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళుతున్నారు. అయితే పార్కింగ్‌ స్థలాల నుంచి భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేర్చుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించినప్పటికీ అది అమలు కావడం లేదు. బుధవారం ఉదయం వరకు జనం పలుచగానే కనిపించినప్పటికీ సారలమ్మ వచ్చే వేళ సాయంత్రానికి ఒక్కసారిగా జనం తాకిడి పెరిగింది. జాతర నలువైపుల నుంచి ప్రవాహంలా భక్తులు తరలివస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మేడారంలోకి ప్రవేశించే అన్ని మార్గాల వద్ద మోహరించిన పోలీసులు ప్రవేటు వాహనాలను అక్కడే నిలిపివేశారు. ప్రత్యేక పాస్‌లు ఉన్న వాహనాలనే లోపలికి అనుమతించారు. అయితే ప్రత్యేక వాహనాలేవీ ఏర్పాటు చేయకుండా భక్తులను మరీ ఐదు కిలోమీటర్ల మేర నడిపించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జ్వరం, తేలు, కుక్క కాట్లతో... కోతుల దాడితో

మేడారం మహాజాతర జాతరలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. భక్తుల్లో కొందరు వాంతులు, విరేచరనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే మేడారం 30పడకల ఆస్పత్రితో పాటు జాతర పరిసరాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో 9,695మంది చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం 30పడకల ఆస్పత్రిలో 2,079మంది చికిత్స పొందారని వెల్లడించారు. ఉదయం 8 గంటల వరకు 849మంది జ్వరంతో, 679 మంది గాయాలతో శిబిరాల్లో చేరారు. 526 మంది గుండె సంబంధసమస్యలతో చికిత్స పొందారు. తేలు కాటుతో 15 మంది, కుక్కలు, కోతుల దాడిలో గాయపడిన 10 మందికి చికిత్స అందించినట్లు ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అప్పయ్య తెలిపారు.

మేడారానికి తొలిసారి రాష్ట్రపతి రాక

మేడారం జాతరకు ప్రముఖులు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం మేడారానికి వచ్చి వనదేవతలను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్‌లో మేడారానికి వస్తారు. మేడారానికి ఓ రాష్ట్రపతి రానుండడం మహాజాతర చరిత్రలో ఇదేతొలిసారి. ఫలితంగా జాతర ప్రాశస్త్యం మరింత విస్తృతమవుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా శుక్రవారమే మేడారానికి రానున్నారు. గద్దెల వద్ద తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం వెంట పలువురు మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండేళ్ల క్రితం మేడారం జాతరకు విచ్చేసిన గవర్నర్‌ తమిళిసై ఈసారి కూడా వచ్చి వనదేవతలను దర్శించుకోనున్నారు. తల్లులను దర్శించుకునేందుకు గురువారం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మేడారానికి రానున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కిషన్‌ రెడ్డి సమీక్ష చేస్తారు. కాగా మేడారాన్ని జాతీయ పండుగగా ప్రకటించాలన్న డిమాండ్‌ చాన్నాళ్లుగా ఉంది. అయితే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించే విషయం ఆలోచిస్తామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ క్రమంలో గురువారం ఈ విషయంలో కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన చేయొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోరాట స్ఫూర్తికి నిదర్శనం సమ్మక్క సారలమ్మ: ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మేడారం మహా జాతర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివాసీల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర బుధవారం ప్రారంభమైన సందర్భంగా ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనులు జరుపుకొనే అతిపెద్ద పండుగల్లో ఒకటైన ఈ మహాజాతర.. మన సాంస్కృతిక వారసత్వానికి స్ఫూర్తి అని అభివర్ణించారు. చైతన్య శక్తికి అద్దం పట్టే మహా వేడుక అని.. భక్తి, సంప్రదాయం, సామూహిక భావనల మహా సమ్మేళనం అని పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మలకు ప్రణమిళ్లి.. వారి ఐక్యత, పోరాట స్ఫూర్తిని స్మరించుకుందామని పిలుపునిచ్చారు.

అక్కడ బెల్లమే బంగారం!

సమ్మక్కసారలమ్మలకు నైవేద్యంగా బెల్లం.. టన్నులకొద్దీ బెల్లం ఉన్నా వాలని ఈగలు!

వరంగల్‌: మేడారం జాతరలో బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. ఇక్కడ ప్రసాదం కూడా బెల్లమే. ఒకానొక సందర్భంలో మేడారంవైపు వచ్చిన కొందరు సంపన్నులు సమ్మక్కను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వారి కోర్కెలు నెరవేరడంతో మళ్లీ రెండేళ్ల తరువాత జాతరకు వచ్చి స్వర్ణాభరణాలు, విలువైన కానుకలు సమర్పించారట. దాన్ని చూసిన ఓ నిరుపేద భక్తుడు ‘మా ఇష్టదైవమైన నీకు ఏమీ సమర్పించుకోలేకపోతున్నాం.. బతుకే బరువైన మేం అంత బంగారం ఎక్కిడి నుంచి తీసుకురావాలి? నీ అనుగ్రహం ఎలా పొందాలమ్మా’ అంటూ సమ్మక్కను వేడుకొని కనీళ్లు పెట్టుకున్నాడట. దీంతో సమ్మక్క ఆ భక్తుడికి రాత్రి కలలో కనిపించి ‘బిడ్డా... నీ దగ్గరున్న బెల్లమిస్తే చాలు.. బంగారం ఇచ్చినట్లే.. బెల్లాన్ని నైవేద్యంగా పెడితే నీ కోర్కెలు తీరుస్తా’ అని చెప్పిందట. దీంతో ఆ పేదవాడు నిలువెత్తు బెల్లాన్ని తూకం వేసి తల్లికి సమర్పించుకున్నాడని, ఆ తర్వాత ఆ పేదవాడి కష్టాలు తీరాయని చెబుతుంటారు. ఇక అప్పటి నుంచి సమ్మక్క, సారలక్కలకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే, తమ కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మేడారం జాతరలో గద్దెల వద్ద కిలోల కొద్దీ బంగారాన్ని (బెల్లం) తీసుకొచ్చి భక్తులు సమర్పిస్తుంటారు. తిరుగు ప్రయాణంలో మాత్రం గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లం కావాలని పోటీపడతారు. ఒకానొక సందర్భంలో ఆ బెల్లం కోసం తొక్కిసలాట కూడా జరుగుతుంది. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు చేరటం సాధారణం. మేడారంలో మాత్రం టన్నుల కొద్దీ బెల్లం ఉన్నా ఈగలు మాత్రం పెద్దగా రావు. క్యూ లైన్లలో గంటల తరబడి బెల్లం బుట్టలతో భక్తులు నిలబడి తల్లుల దర్శనానికి వేచి ఉన్న సమయంలోనూ బెల్లంపై ఈగలు వాలవు. ఇంత పెద్ద మొత్తంలో బెల్లం పోగవుతున్నా ఈగల చికాకు లేకపోవడానికి కారణం ఇక్కడ బెల్లం అమ్మవారి ప్రసాదం కావటమే అన్న విశ్వాసం భక్తుల్లో ఉంది. సమ్మక్క మహిమ వల్లే భక్తులు సమర్పించే బెల్లంపైకి ఈగలు వాలవని భక్తులు విశ్వసిస్తారు.

దివ్యౌషధం కూడా

మేడారం మహాజాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచే ఇది జరుగుతోంది. పూర్వం సుదూరాల నుంచి మైళ్లకొద్ది ప్రయాణించి మేడారానికి చేరుకొని దాదాపు వారంరోజులు గడిపేవారు. ఈ క్రమంలో ఆకలైనప్పుడు త్వరితశక్తిని అందించే స్వభావం కలిగిన బెల్లం లేదా బెల్లం పానకంతో తయారుచేసే ఆహారపదార్థాలను తినేవారు.అలాగే జాతర సమయంలో ఎగిసిపడే దుమ్మూ, ధూళిని పీల్చడం ద్వారా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో బెల్లం చప్పరించడం ద్వారా శ్వాసనాళాల్లోని సమస్యలను తొలగించవచ్చని నమ్మేవారు. దీంతో జాతరలో బెల్లమే ప్రసాదంగా మారిందని కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

Updated Date - Feb 22 , 2024 | 07:35 AM