Share News

సచివాలయం ఖర్చు డబుల్‌!

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:59 AM

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గత సర్కారు హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపు అయింది.

సచివాలయం ఖర్చు డబుల్‌!

అంచనా రూ.617 కోట్లు.. వ్యయం రూ.1,140 కోట్లు

సవరించిన అంచనాల్లో పొందుపర్చిన ఆర్‌అండ్‌బీ

రేవంత్‌ సర్కారు విస్మయం

వివరాలు ఇవ్వాలని ఆర్‌ అండ్‌ బీకి ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గత సర్కారు హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపు అయింది. ఈ మొత్తాన్ని చూసి ప్రస్తుత ప్రభుత్వం విస్మయం చెందింది. ఇంత వ్యయం ఎందుకైంది? ఏయేదానికి ఎంతెంత వెచ్చించారనే పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయమై ప్రస్తుతం ప్రభుత్వంలో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న, మొన్నటిదాక సచివాలయ నిర్మాణ ఖర్చు వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరు కోరినా బీఆర్‌ఎస్‌ సర్కారు మంజూరు చేసిన రూ.617 కోట్ల జీవో కాపీనే చూపిస్తూ వచ్చింది రోడ్లు భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ. తాజాగా మాత్రం ఖర్చు, పెరిగిన అంచనాలను నివేదించింది. ఈ మొత్తాన్ని రూ.1,140 కోట్లుగా పేర్కొంది. దీంతోనే పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం, సంబంధిత మంత్రి కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి, సచివాలయ నిర్మాణ ఖర్చెంత అన్నది తేలడం లేదు. ముందుగా వేసిన నిధుల అంచనా, తర్వాత వ్యయం విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా.. ఇదివరకు నిర్ణయించిన బడ్జెట్‌ గురించే చెబుతున్నారు తప్ప, వాస్తవ అంచనాలు, కేటాయింపులు, వ్యయం వివరాలు లేదు. ఈ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలు, వాటిలో జరిగిన ఖర్చులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఆర్‌అండ్‌ బీ చేపట్టిన సచివాలయంపై నిశిత పరిశీలన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ ఖర్చు, అంచనాలను తెలుపుతూ ఆ శాఖ నివేదిక ఇచ్చినట్లుగా తెలిసింది.

అన్ని నిధులెలా ఖర్చయ్యాయి.?

సచివాలయం నిర్మాణం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.617 కోట్లను మంజూరు చేసిందని, వాటిలో రూ.588 కోట్లు ఖర్చు చేసినట్లు యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్‌అండ్‌బీ శాఖ ఫిబ్రవరి 12న తెలిపింది. కానీ, తాజాగా నివేదికలో మాత్రం సవరించిన అంచనాల మేరకు ఖర్చు రూ.1,140 కోట్లకు చేరిందని పేర్కొంది. ఈ నిధుల చెల్లింపునకు ప్రభుత్వానికి ఫైల్‌ పంపినట్లు తెలిపింది. కాగా, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయానికి రూ.558.10 కోట్లు ఖర్చయ్యాయని, రూ.13.15 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగిన సంస్థకు ఆర్‌అండ్‌బీ శాఖ ఫిబ్రవరిలోనే సమాధానం ఇచ్చింది. వాస్తవానికి సవరించిన అంచనాలను అధికారులు జనవరిలోనే ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలిసింది. అంటే, సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి ముందే ఈ అంచనాలు వచ్చినట్టు. కానీ, అధికారులు దాన్ని తొక్కిపెట్టి తప్పుడు వివరాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభమైన కొంతకాలానికి శాఖకు వచ్చిన ఉన్నతాధికారే ఇప్పటికీ విధుల్లో ఉన్నారు. అన్ని వ్యవహారాలను పర్యవేక్షించారు కూడా. ఆయనకు పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం ఇచ్చిన నివేదికే అంతిమమా..? ఇంకేమైనా పెరిగే అవకాశముందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఇంతకీ చెల్లింపులెన్ని? అసలు వ్యయం ఎంత?

సవరించిన అంచనా రూ.1,140 కోట్లకు చేరిందని నివేదించినా గతంలో మంజూరైన రూ.617 కోట్ల బిల్లులకు సంబంధించిన చెల్లింపులు, అందులోనే కొంత పెండింగ్‌ ఉందని మాత్రమే తెలిపారు. అంచనా కంటే ఖర్చు పెరిగినపుడు బిల్లుల చెల్లింపు కూడా అదే స్థాయిలో ఉన్నదని చెప్పలేదు. పెరిగిన అంచనాల మేరకు రూ.500 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ అంచనాల్లో సచివాలయ భవనం, ఇతర కొన్ని పనులను మాత్రమే చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం వేరే శాఖలకు అప్పగించి నిర్మించదల్చిన మసీదు, గుడి, చర్చి, ఇతర రోడ్లు సహా మరికొ న్ని పనులు కూడా ఆర్‌అండ్‌బీనే చేపట్టింది. దీంతోనే సచివాలయ నిర్మాణ ఖర్చు పెరిగినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే, నిర్మాణ వ్యయం, అంచనాలన్నీ గతంలోనే పెరిగినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం పాత అంచనాలు, నిధుల కేటాయింపు, ఖర్చును మాత్రమే ఇప్పటిదాక చెబుతూ రావడం గమనార్హం. కాంగ్రెస్‌ ప్రభుత్వం సచివాలయ నిర్మాణం ఖర్చు అంశాలపై దృష్టిసారించడంతోనే.. నిర్మాణ అంచనాలు పెరిగినట్లు తెరమీదకు వచ్చింది.

Updated Date - Mar 24 , 2024 | 02:59 AM