Share News

నోటిఫై గ్రామాల నుంచే ఇసుక తరలించాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:39 PM

పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో నోటిఫై చేసిన ప్రాంతాల నుంచి ఇసుకను తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌ రావు అన్నారు.

నోటిఫై గ్రామాల నుంచే ఇసుక తరలించాలి
సమీక్షిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌ రావు

- ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చేయాలి - అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 24 : పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో నోటిఫై చేసిన ప్రాంతాల నుంచి ఇసుకను తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌ రావు అన్నారు. బలహీన వర్గాల గృహనిర్మాణ పథకాలకు, సొంత గృహ అవసరాలకు, జిల్లా యూనిట్‌గా మూసాపేట, జడ్చర్ల, అడ్డాకుల, చిన్నచింతకుంట, కోయిలకొండ మండలాల్లోని వివిధ గ్రామాలను నోటిఫై చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల వాగుల నుంచి ఇసుక లభ్యతననుసరించి ఇసుక ఉచిత వినియోగానికి, ఇసుక తవ్వకాలకు, నియంత్రణకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని తెలిపారు. తు.చ. తప్పకుండా అమలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్‌లను, గనులు, భూగర్భ జలవనరుల శాఖ, రవాణా, పోలీస్‌ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాలకు, స్వంత గృహ అవసరాలకు ప్రభుత్వం నోటిఫై చేసిన సమీపంలోని వాగుల నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లే వెసులు బాటు కల్పించాలన్నారు. ప్రభుత్వ పనులకు సీనరేజీ జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ధేశించిన ప్రకారం చెల్లించాలన్నారు. ఇతరులు అనుమతులు లేకుండా వాణిజ్య అవసరాలకు లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తే, నియంత్రించి సంబంధిత శాఖల అధికారులు జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఇసుక వెలికితీత మ్యానువల్‌గా మాత్రమే నిర్వహించాలని, ఎద్దుల బండి, ట్రాక్టర్‌ల ద్వారానే రవాణా చేయాలన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌ వివరాలను సంబంధిత తహసీల్దార్‌ వద్ద నమోదు చేయాలన్నారు. ఉచిత ఇసుక తరలించే వాహనానికి ఫ్లెక్సీని వాహనం ముందు ప్రదర్శించాలని సూచించారు. ఇసుక తవ్వకాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే నిర్వహించాలన్నారు. రాత్రి పూట తరలిస్తున్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:39 PM