Share News

మానేరులో ఇసుక తవ్వకాలు తప్పు

ABN , Publish Date - May 22 , 2024 | 05:10 AM

మానేరు నదిలో ఇసుక తవ్వకాలపై చెన్నై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ సౌత్‌ బెంచ్‌ సంచలన తీర్పునిచ్చింది.

మానేరులో ఇసుక తవ్వకాలు తప్పు

పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు.. సంచలన తీర్పు వెలువరించిన చెన్నై ఎన్జీటీ కోర్టు

సంచలన తీర్పు వెలువరించిన చెన్నై ఎన్జీటీ కోర్టు

పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు

మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలకు 25 కోట్ల చొప్పున ఫైన్‌

గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు చెల్లించాలి..

మూడు నెలల క్రితం రిజర్వు చేసిన తీర్పు వెల్లడి

ఫలించిన మానేరు పరిరక్షణ సమితి పోరాటం

పెద్దపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): మానేరు నదిలో ఇసుక తవ్వకాలపై చెన్నై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ సౌత్‌ బెంచ్‌ సంచలన తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడం తప్పు అని స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో నిరక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలకు రూ.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను మూడు నెలల్లోగా గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతుందని, పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారంటూ మానేరు పరిరక్షణ సమితికి చెందిన వారితోపాటు ఇతరులు మొత్తం ఐదు పిటిషన్లను ఎన్జీటీలో దాఖలు చేశారు. వీటిపై విచారించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చెన్నై సౌత్‌ బెంచ్‌ మూడు నెలల క్రితమే తీర్పును రిజర్వు చేసింది. మంగళవారం ఆ తీర్పును వెలువరించింది. కాగా, మానేరు నదిపై నిర్మిస్తున్న చెక్‌ డ్యాముల్లో ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సి ఉంటుందని సంబంధిత అధికారుల కమిటీ గత ప్రభుత్వ హయాంలో నివేదిక సమర్పించింది. పెద్దపల్లి జిల్లాలో 25 ఇసుక రీచులను గుర్తించారు. ఈ రీచుల్లో రెండు మీటర్ల లోతు వరకు 1,32,67,620 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేందుకు 2022 జనవరి 11న టీఎ్‌సఎండీసీ టెండర్లను ఆహ్వానించింది. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని ఇసుక రీచులను దక్కించుకోగా 2023 డిసెంబరు నెలాఖరు వరకు ఇసుక తవ్వకాలకు డిస్ట్రిక్ట్‌ లెవల్‌ శాండ్‌ కమిటీ(డీఎల్‌ఎస్సీ) అనుమతి ఇచ్చింది. ఆ మేరకు గడువు పూర్తయిన తర్వాత కూడా డంపుల్లో ఉన్న ఇసుకను తరలించారు. కరీంనగర్‌, జయశంకర్‌ భూపాపల్లి జిల్లాల్లోనూ క్వారీలను గుర్తించి ఇసుక తవ్వకాలు చేపట్టారు.

క్వారీలను రద్దు చేయాలని కోరినా..

ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఓవర్‌ లోడ్‌తో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇసుక లారీలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, క్వారీలను రద్దు చేయాలని మానేరు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. అప్పటి ప్రభుత్వానికి పలుసార్లు మొరపెట్టుకున్నా వినకపోవడంతో మానేరు పరిరక్షణ సమితికి చెందిన సభ్యులతో పాటు కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు చెన్నై ఎన్జీటీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు పర్యావరణ అనుమతులపై పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినప్పటికీ ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ప్రవేశపెట్టలేదు. గతంలోనే మానేరు ఇసుక తరలింపును నిలిపివేయాలని ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వం ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరించి తవ్వకాలకు సానుకూలంగా వ్యవహరించింది. దీనిపై తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు.. మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబరు 23కు వాయిదా వేసింది.

Updated Date - May 22 , 2024 | 05:10 AM