Share News

ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్లకు మోక్షం!

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:04 AM

మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.

ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్లకు మోక్షం!
ప్రమాదకరంగా ఉన్న ఎల్లారెడ్డిగూడెం బస్టేజీ వద్ద చెర్వుగట్టు వెళ్లే క్రాసింగ్‌

మంత్రి కోమటిరెడ్డి ఆదేశంతో కదిలిన అధికారులు

ఎట్టకేలకు ప్రారంభమైన విస్తరణ పనులు

ఇరువైపులా 2 మీటర్ల చొప్పున డ్రైన్‌, పైప్‌లైన్‌లు

స్థల సేకరణ బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం అందజేత

అదనపు స్థల సేకరణ కోసం బాధితులతో నేడో రేపో సమావేశం

నార్కట్‌పల్లి, జూన్‌ 11: మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా ఇదే మం డలానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండటంతో సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది. 2013 లో నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి విస్తరణ నిర్మాణంలో భాగంగా ఎల్లారెడ్డిగూడెం వద్ద ఫైఓవర్‌ రోడ్డు వేశారు. కానీ గడిచిన పదేళ్ల కాలంలో సర్వీస్‌ రోడ్లను వేయకపోవడంతో ఎల్లారెడ్డిగూడెం బస్టాప్‌ నుంచి చెర్వుగట్టుకు వెళ్లే జంక్షన్‌ వద్ద రోడ్డు దాటే క్రమంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుని పదుల సంఖ్యలో మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యా రు. అయితే ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు గ్రామస్థులు, రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలు ప్రమాద సంఘటనలు జరిగిన ప్రతీసారీ జంక్షన్‌ వద్ద రోడ్డెక్కి ఆందోళన చేయడం... పోలీసులు సర్దిచెప్పడంతో విరమించ డం పరిపాటిగా మారిందే తప్ప సర్వీస్‌ రోడ్లు నిర్మా ణం పూర్తికాలేదు. సర్వీస్‌ రోడ్డు విస్తరణలో భాగంగా గత బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్వాసితులకు నష్టపరిహా రం అందినా పనులు చేపట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్లు మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో ఇదే గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్‌ వడ్డే భూపాల్‌రెడ్డి చొరవ తీసుకుని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్ల సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లాడు. స్పందించిన మంత్రి వెంటనే సంబంధి త అధికారులను ఆదేశించడంతో ఆర్‌అండ్‌బీ సీఈ మధుసూదన్‌రెడ్డి స్వయంగా ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్‌ రోడ్డు విస్తరణ ప్రదేశాన్ని పరిశీలించి రోడ్డు విస్తరణ పనులు చేసిన (నామ్‌ వే సంస్థ) సంస్థ ఉద్యోగులకు చేసిన సూచన మేరకు ఎట్టకేలకు సర్వీస్‌ రోడ్డు పనులను ప్రారంభించారు.

రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లింపు

సర్వీస్‌ రోడ్ల విస్తరణకు అదనంగా స్థలాన్ని సేకరించాల్సి ఉంది. తొలుత చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. రోడ్డు నిర్మాణం చేపట్టిన పదేళ్ల నాటి ట్రాఫిక్‌ సెన్సెన్‌ బట్టి ఇరువైపులా 5.75 మీటర్ల చొప్పున సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందు లో 3.75మీటర్ల వెడల్పుతో రోడ్డు, 1మీటరు వెడల్పు తో డ్రైనేజీ, 1 మీటరు వెడల్పులో పైప్‌లైన్లు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థలసేకరణ కోసం ఇరువైపు లా 155 మంది నిర్వాసిత బాధితులను గుర్తించి ప్రభు త్వ రిజిస్ట్రేషన్‌ రేటు ప్రకారం రెండింతలు పెంచి సు మారు రూ.1.50 కోట్లను నష్టపరిహారంగా ఇప్పటికే చెల్లించారు.

ఆర్చీ వద్ద క్రాసింగ్‌పై రాని స్పష్టత

ఎల్లారెడ్డిగూడెం బస్టేజీ నుంచి చెర్వుగట్టుకు వెళ్లే రోడ్డు వద్ద ఉన్న క్రాసింగ్‌ను మూసివేయాలా? తెరిచి ఉంచాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇరువైపులా సర్వీస్‌ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మెయిన్‌ రోడ్డుకు ఎక్కకుండా గ్రిల్స్‌తో మూసివేయనున్నారు. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే మనుషులు దాటేలా గ్రిల్స్‌లో కొంచెం గ్యాప్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. బస్టేజీ నుంచి చెర్వుగట్టుకు వెళ్లే ఆర్చీ వద్ద క్రాసింగ్‌ను మూసివేయాలా లేక తెరిచే ఉంచాలా అనే విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని నామ్‌వే సిబ్బంది చెబుతున్నారు.

బాధితులతో సమావేశం?

సర్వీస్‌ రోడ్ల విస్తరణ కోసం ఇప్పటికే గుర్తించి సేకరించిన స్థలానికి అదనంగా మరికొంత స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇందుకోసం బాధితులతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సర్వీస్‌ రోడ్డు ఇంతకు ముందు నిర్ణయించిన దానికన్నా 2 మీటర్లు పెంచాల్సిన అవసరాన్ని నిర్వాసిత బాధితులకు వివరించి వారిని ఒప్పించనున్నారు.

సర్వీస్‌ రోడ్డు వెడల్పు పెంపునకు అదనంగా భూ సేకరణ

సర్వీస్‌ రోడ్ల వెడల్పును మరింత విస్తరించాలని నిర్ణయించారు. పదేళ్ల క్రితం అప్పటి ట్రాఫిక్‌ సెన్సెస్‌ ప్రకారం సర్వీస్‌ రోడ్డును 3.75 మీటర్ల వెడల్పుగా చేయాలని ప్రతిపాదించారు. కానీ గడిచిన పదేళ్లలో చెర్వుగట్టు క్షేత్రానికి భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో సర్వీస్‌ రోడ్డు వెడల్పును 3.75 మీటర్ల నుంచి 5.50 మీటర్లకు పెంచాలని తాజాగా నిర్ణయించారు. పెంచిన ప్రకారమైతే ఇరువైపులా సర్వీస్‌ రోడ్డు విస్తరణ 7.50 మీటర్లకు పెరిగి విశాలంగా మారుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం సీఈ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అధికారుల బృందం కూడా పరిశీలన చేసింది. ఇలా అదనపు భూ సేకరణ చేయాల్సి వస్తే మరో 40 గుంటల భూమి 67 నిర్మాణాలను తొలగించాల్సిందిగా నామ్‌వే ఉద్యోగులు గుర్తించారు.

క్రాసింగ్‌ వద్ద వీయూపీ నిర్మించాలి

ఎల్లారెడ్డిగూడెం బస్టేజీ వద్ద ప్రస్తు తం చెర్వుగట్టుకు వెళ్లే క్రాసింగ్‌ ప్రదేశంలో భవిష్యత్తులోనైనా వీయూపీ నిర్మించాలి. జిల్లాలోనే అతిపెద్ద క్షేత్రం కావడంతో రానున్న మరో పదేళ్లలో చెర్వుగట్టు క్షేత్రాని కి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగనున్నందున ఫైఓవర్‌ పై క్రాసింగ్‌ను వీయూపీగా మార్చాలని మంత్రి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంలను గ్రామస్థుల తరపున కోరుతున్నాం. విస్తరణలో స్థలాలు కోల్పోతు న్న బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించేందు కు మంత్రి, ఎమ్మెల్యేలు సహకరించాలి.

- వడ్డే భూపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డిగూడెం

Updated Date - Jun 12 , 2024 | 12:04 AM