Share News

ధరణి దరఖాస్తులకు మోక్షం!

ABN , Publish Date - May 30 , 2024 | 11:36 PM

ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం ధరణి పోర్టల్‌లోని పెండింగ్‌ భూముల దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెలాఖరులోపు జీఎల్‌ఎం, టీఎం-33లతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించారు.

 ధరణి దరఖాస్తులకు మోక్షం!

పోర్టల్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్‌లకు లాగిన్‌లు

మేడ్చల్‌ మే 30(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం ధరణి పోర్టల్‌లోని పెండింగ్‌ భూముల దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెలాఖరులోపు జీఎల్‌ఎం, టీఎం-33లతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక డ్రైవ్‌లో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. దరఖాస్తులను పారదర్శకంగా పరిష్కరించే నిమిత్తం క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు పాత రికార్డులను పరిశీలించాలని నిర్ణయించారు. అయితే గతంలో ధరణి సమస్యలు పరిష్కరించే అధికారం కలెక్టర్‌లకు మాత్రమే ఉండేది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో ఆర్డీఓలు, తహసీల్దార్‌లకు లాగిన్‌ సౌకర్యం కల్పించారు. ఆర్డీవోలకు పట్టాదారు పాసుపుస్తకం లేకుండా నాలా కన్వర్షన్‌, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ఎన్నారైలకు సంబంధించిన భూ సమస్యలతో పాటు కోర్టు కేసుల పరిష్కారం, మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు తదితరాలను పరిష్కరించే అధికారం అప్పగించారు. తహసీల్దార్‌కు పట్టా, అసైన్డ్‌ భూముల విరాసత్‌(పౌతీ), జీపీఏ, స్పెషల్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌, ఖాతా మెర్జింగ్‌ వంటి వాటికి బాధ్యతలు అప్పగిస్తూ లాగిన్‌ సౌకర్యం కల్పించారు. పెండింగ్‌ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసేందుకు ప్రభుత ్వం కలెక్టరేట్‌లతో పాటు ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో డ్యాష్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బోర్డుల్లో ఏ రకమైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు వెల్లడించనున్నారు. పెండింగ్‌కు గల కారణాలను సైతం తెలియజేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరిస్తున్నాం:

ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము. ఇటీవలే ప్రభుత్వం ఆర్డీవోలతో పాటు తహసీల్దార్‌లకు లాగిన్‌ సౌకర్యం కల్పించింది. ఈ నెలాఖారులోపు పెండింగ్‌ దరఖాస్తులు లేకుండా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం.

- విజయేందర్‌రెడి ్డ, జిల్లా అదనపు కలెక్టర్‌

Updated Date - May 30 , 2024 | 11:36 PM