Share News

బోధన్‌, ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షం

ABN , Publish Date - May 03 , 2024 | 05:13 AM

ఎనిమిదేళ్లుగా మూతబడి ఉన్న బోధన్‌, ముత్యంపేట చక్కెర పరిశ్రమలకు మోక్షం లభించనుంది. ఈ రెండు పరిశ్రమలూ లోక్‌సభ ఎన్నికల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం

బోధన్‌, ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు మోక్షం

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద

బ్యాంకులకు పాత బకాయిల చెల్లింపు

రూ.43 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఎన్నికల తర్వాత తెరచుకోనున్న ఫ్యాక్టరీలు

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

చెరకు రైతులు, కార్మిక వర్గాల్లో హర్షం

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్లుగా మూతబడి ఉన్న బోధన్‌, ముత్యంపేట చక్కెర పరిశ్రమలకు మోక్షం లభించనుంది. ఈ రెండు పరిశ్రమలూ లోక్‌సభ ఎన్నికల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిజాం డెక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కింద ఉన్న బోధన్‌, ముత్యంపేట చక్కెర పరిశ్రమలకు ఉన్న పాత బకాయిలను బ్యాంకర్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. దీంతో బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.43కోట్ల మేర నిధులు కూడా విడుదల చేసింది. చెల్లింపులు పూర్తి కాగానే ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయి. ఇదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి రైతులకిచ్చిన హామీ నెరవేరినట్టే. సెప్టెంబర్‌ 17లోగా చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌ ఇటీవల కూడా చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్‌ సబ్‌ కమిటీ..

బోధన్‌, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీలు 2015 డిసెంబర్‌ 8న మూతపడ్డాయి. ఈ పరిశ్రమలను పునఃప్రారంభించాలనే డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ, గత ప్రభుత్వం ఈ పరిశ్రమల అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్‌ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. కానీ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కో ఆపరేటివ్‌ విధానంలో ఫ్యాక్టరీలను నడుపుతామంటూ 2015, ఏప్రిల్‌లో విడుదల చేసిన ఉత్తర్వులను పక్కనబెట్టారు. ఇక, గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాదయాత్ర చేసిన రేవంత్‌ రెడ్డి.. ముత్యంపేటలో ఒకరోజు రాత్రి బస చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని ఆ సమయంలో చెరుకు రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి.. పరిశ్రమల పునరుద్ధరణ నిమిత్తం ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన 2024 జనవరిలో మంత్రివర్గ ఉపసంఘాన్ని(కేబినెట్‌ సబ్‌ కమిటీ) నియమించారు. పలు చర్చల అనంతరం ఆర్థిక ఇబ్బందులు, పాత బకాయిలే బోధన్‌, ముత్యంపేట చక్కెర కర్మాగారాలకు ప్రధాన సమస్యలని ఆ కమిటీ తేల్చింది. దీంతో బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు అడుగులు పడ్డాయి. ఈ పరిశ్రమలు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి భించనుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ప్రభుత్వం చూపిన చొరవ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 05:13 AM