Share News

జీతాలు పడ్డాయోచ్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 03:20 AM

రోజుకు ఇన్ని జిల్లాల వంతున.. విడతల వారీగా చెల్లింపు.. ఒకటో తేదీన అందాల్సినవి 12 నుంచి 20వ తేదీ వరకు..!

జీతాలు పడ్డాయోచ్‌

4వ తేదీకల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపు పూర్తి

కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక.. తొలి నెలలోనే సకాలంలో

వేతన జీవులకు ఊరట.. ఇది కొనసాగాలని ఆకాంక్ష

బీఆర్‌ఎస్‌ హయాంలో 12, 20 తేదీల దాకా చెల్లింపు

హైదరాబాద్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రోజుకు ఇన్ని జిల్లాల వంతున.. విడతల వారీగా చెల్లింపు.. ఒకటో తేదీన అందాల్సినవి 12 నుంచి 20వ తేదీ వరకు..! ఇదీ మొన్నటివరకు వేతనాల విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొన్న అనుభవం. ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. నెల వాయిదాలు చెల్లించలేని ఇబ్బంది కలిగింది. ఇప్పుడా వ్యథ తప్పింది. విపరీతమైన జాప్యానికి తెరదించుతూ.. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తొలి నెలలోనే, ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగానే ఉద్యోగులు, పింఛనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది. గురువారం (4వ తేదీ)తో అన్ని జిల్లాల్లోని వారికి డిసెంబరు నెల వేతనాలు, పింఛన్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రంలో డిసెంబరు 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ప్రస్తుత సర్కారు తొలిగా ఇస్తున్న వేతనాలను సకాలంలో మంజూరు చేసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతి నెల 12, 20 తేదీ వరకు జీతాలిచ్చిన పద్ధతికి స్వస్తి పలికింది. దీనిపై ఉద్యోగులు, పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదట ఇదే విధానం అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు.

2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఆలస్యం కావడం మొదలైంది. అలవికాని హామీలు, కొత్త పథకాలకు నిధులను మళ్లించడంతో జీతాలను 12, 20 తేదీల వరకు చెల్లిస్తూ వచ్చారు. దీన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసించాయి. జీతాల ఆలస్యంతో నెల వాయిదాలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లించాలంటూ కొన్ని సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశాయి. కాగా, కీలకమైన గెజిటెడ్‌ అధికారుల సంఘం, తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘం ఈ విషయంలో పెద్దగా పోరాటం చేయలేకపోయాయి. దాంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి నెల ఆలస్యంగా ఇస్తూ వచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనికితగ్గట్లే.. ఈ నెల 2న కొన్ని జిల్లాల ఉద్యోగులకు వేతనాలు, 3న పింఛన్లు, 4న మిగిలిపోయిన జిల్లాల ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు. సాధారణంగా ఉద్యోగులకు ప్రతి నెలా సగటున రూ.3,250 కోట్లు, పింఛనర్లకు రూ.1,100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.4,300-4,500 కోట్లను ఖజానా నుంచి విడుదల చేయాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసింది.

Updated Date - Jan 05 , 2024 | 03:20 AM