Share News

సైదులు బాబా.. సమస్యలు తీర్చవా?

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:20 AM

కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్‌ దర్గా సమస్యల నిలయంలో కొట్టుమిట్టాడుతోంది.

 సైదులు బాబా.. సమస్యలు తీర్చవా?
నిరుపయోగంగా ఉన్న మంచీనీటి బావి, శిథిలావస్థలో మరుగుదొడు

కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్‌ దర్గా సమస్యల నిలయంలో కొట్టుమిట్టాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జానపహాడ్‌ దుర్గాకు ప్రత్యేకత ఉంది. కందూరు పేరుతో జాన్‌పహాడ్‌ సైదన్నకు ఉర్సు సమయంలో లక్షల్లో, ప్రతీ శుక్రవారం వేల సంఖ్యలో భక్తులు వచ్చి మెక్కులు తీర్చుకుంటారు. ఇదిలా ఉండగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో మొక్కులు తీర్చుకోనున్నారు. ఉర్సు ఉత్సవాలు దగ్గరపడుతున్నా మౌలిక సౌకర్యాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

- పాలకవీడు

దర్గా వద్ద మౌలిక వసతులు కూడా కల్పించిన నిర్వాహకులు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మహిళలు స్నానపుగదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, పాలకులు మారుతున్నా భక్తులకు వసతులు కల్పించడంలో పూర్తిగా చెందుతున్నారు. దర్గా పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా భక్తులకు తాగునీటిని అందించడంలో వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాగు నీరు కోసం చాలా దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల కుళాయి ఏర్పాటుచేసినా ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆ నీటిని తాగడం లేదు. ఉర్సు సమయంలో 2 లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకు బట్టలు మార్చుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు అంతంత మాత్రమే. ఉర్సుకు వచ్చిన భక్తులు కందూరు కింద మూగజీవాలను బలిచ్చి అక్కడే వండుకు తింటారు. అయితే షెడ్లూ లేకపోవడంతో దుమ్ముధూళి మధ్య ఆరుబయటనే వండుకోవాల్సి వస్తోంది. అదేవిధంగా దర్గాలో నిద్ర చేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల విశ్వాసం. దీంతో వారు జాగారాల పేరుతో దర్గాలోనే పడుకుంటారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా వక్ఫ్‌బోర్డ్‌ అధికారులు ఈ ప్రాంతంలో భక్త్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు నయా పైసా ఖర్చు చేయలేదు. ఎక్కువగా ఇక్కడికి నిరుపేదలు, గిరిజనులు అధికంగా వస్తారు. ఆదాయం మీద శ్రద్ధ తప్ప భక్తులకు వసతుల కల్పించడంలో వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ఏడాది ఉత్సవాల నాటికైనా కనీస వసతులు కల్పించాలని, దర్గా ప్రాంతంలో సీసీరోడ్లు వేసి, మురుగు కాల్వలు నిర్మించాలని, ఇతర సౌకర్యాలు అందించాలని భక్తులు కోరుతున్నారు.

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు

జాన్‌పహాడ్‌ దర్గాకి వచ్చిన భక్తుల దగ్గర కాంటాక్టర్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. చిన్నతనం నుంచి ప్రతీ ఏడాది దర్గాకు వచ్చి మొక్కులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక యాటపోతుతో కందూరు చేయాలంటే కాంట్రాక్టర్లకే రూ.3వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. కం దూరు ఖర్చు ఎంత ఖర్చు వస్తుందో అంతకంటే ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు కానీ సరైన సౌకర్యాలు కల్పించడంలేదు. స్నానపు గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల్లేక మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. భక్తలకు సౌకర్యాలు కల్పించాలి.

- రంగయ్య, భక్తుడు, సూర్యాపేట

దర్గా ఉర్సుకు రూ.13 లక్షల నిధులు కేటాయింపు

జానపహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ రూ.13లక్షల నిధులు కేటాయించారు. స్నానపుగదులు, మరుగుదొడుఉ్ల, విశ్రాంతి గదుల నిర్మాణాలు చేపడతాం. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

- మహమూద్‌, వక్ఫ్‌బోర్డు అధికారి, జానపహాడ్‌ దర్గా

Updated Date - Jan 09 , 2024 | 12:20 AM