Share News

ఎల్‌ఆర్‌ఎ్‌సకు సై!

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:28 AM

ఇళ్ల స్థలాలకు సంబంధించి 2020 నాటి లేఅవుట్‌ రెగ్యులేషన్‌ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులకు మోక్షం లభించనుంది.

ఎల్‌ఆర్‌ఎ్‌సకు సై!

దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి.. మార్చి 31లోగా పూర్తి చేయండి

పూర్తి రుసుం చెల్లిస్తే క్రమబద్ధీకరించండి.. పాత నిబంధనలే వర్తింపజేయండి

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశం.. పెండింగ్‌ దరఖాస్తులు 25 లక్షల పైనే

హైదరాబాద్‌, ్చఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఇళ్ల స్థలాలకు సంబంధించి 2020 నాటి లేఅవుట్‌ రెగ్యులేషన్‌ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులకు మోక్షం లభించనుంది. లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు మేలుచేసే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి 25.44 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. 13 కార్పొరేషన్ల నుంచి 4.13 లక్షలు, 129 మునిసిపాలిటీల నుంచి 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు అందాయి. ఇంటి స్థలానికి రూ.1000, లేఅవుట్‌ అయితే రూ.10,000 చొప్పున దరఖాస్తు రుసుముగా వసూలు చేశారు. తరువాత క్రమబద్ధీకరణ ముందుకు సాగలేదు. దరఖాస్తు చేసుకున్న వారంతా ప్రభుత్వ నిర్ణయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం ఉన్నవాళ్లు అధికారులను ఆశ్రయించి క్రమబద్ధీకరణ చేయించుకుంటున్నారు. అధికారులు కూడా నిబంధనల్లోని వెసులుబాట్లను పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. అదే సమయంలో 2020 ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు.

కోర్టు కేసుల వల్ల జాప్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ సోమవారం రెండు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు కేసుల వల్ల దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమైందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన 2020 నాటి నిబంధనల ప్రకారమే లేఅవుట్‌ క్రమబద్ధీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు పూర్తి రుసుం చెల్లించి మార్చి 31 లోగా లేఅవుట్‌ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను మినహాయించి ఇతర లేఅవుట్‌లను క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశించారు. అయితే, మార్చి 31 గడువు మీదే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంత స్వల్ప గడువులో డబ్బులు సమకూర్చుకోవడం కష్టం అవుతుందని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారగొని ప్రవీణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసి 2020లో దరఖాస్తు చేసుకోని వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పాత జీవో ఏం చెప్పిందంటే?

అనుమతి లేని, అనధికారిక లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 31-8-2020న జీవో 131 జారీ చేసింది. 100 చదరపు మీటర్లకు లోపు ఉంటే చదరపు మీటరుకు రూ.200 చొప్పున, 101 నుంచి 300 చదరపు మీటర్ల లోపు ఉంటే చదరపు మీటర్‌కు రూ.400 చొప్పున, 301 నుంచి 500 చదరపు మీటర్ల లోపు ఉంటే రూ.600చొప్పున, 500 అంతకంటే ఎక్కువ చదరపు మీటర్లు ఉంటే ఒక్కో చదరపు మీటరుకు రూ.750 చొప్పున బేసిక్‌ క్రమబద్ధీకరణ చార్జీలు అవుతాయని జీవోలో పేర్కొన్నారు. భూమి విలువను బట్టి బేసిక్‌ క్రమబద్ధీకరణ రుసుములో 25, 50, 75, 100 శాతం చొప్పున క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాలని తెలిపారు. 20-8-2020 నాటికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పేర్కొన్న భూమి విలువ చదరపు గజం రూ.3000 ఉంటే బేసిక్‌ క్రమబద్ధీకరణ రుసుములో 25శాతం, రూ.3001 నుంచి రూ.5 వేల వరకు ఉంటే 50 శాతం, రూ.5001 నుంచి రూ.10000 లోపు ఉంటే 75 శాతం రూ.10,001 అంతకన్నా ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 300 చదరపు మీటర్ల ప్లాట్‌ ఉండి,

అక్కడ భూమి విలువ ప్రభుత్వ రికార్డుల ప్రకారం చదరపు మీటర్‌ 10,000 ఉంటే పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం బేసిక్‌ క్రమబద్దీకరణ రుసుము రూ.1,20,000 అవుతుంది. అక్కడ భూమి విలువను పరిగణనలోకి తీసుకున్నపుడు క్రమబద్ధీకరణ రుసుము బేసిక్‌ రుసుములో 75 శాతం అవుతుంది. అంటే, రూ.90,000 అవుతుంది. అదే భూమి విలువ చదరపు మీటర్‌కు రూ.10,000 దాటితే బేసిక్‌ రుసుములో వంద శాతం అంటే రూ.1,20,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్‌ సైజు, భూమి ధరను బట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము ద్విముఖంగా పెరుగుతుంది. దీనికితోడు లేఅవుట్‌లో 10 శాతం ఓపెన్‌ స్థలం చూపకపోతే ప్లాట్‌ విలువలో మరో 14శాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మురికివాడల్లో భూమి విలువతో సంబంధం లేకుండా చదరపు మీటరుకు రూ.5చొప్పున చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు. లేఅవుట్లలో రోడ్డు వెడల్పు 9 మీటర్లు ఉండాలని స్పష్టం చేశారు. 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ప్లాట్లు ఉండే బలహీన వర్గాల కాలనీల్లో రోడ్డు వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్ల యజమానులు దరఖాస్తు చేసుకోకుంటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయబోమని జీవోలో స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తం డబ్బును తిరిగి అదే లేఅవుట్ల అభివృద్ధికి, వసతుల కల్పనకు ఖర్చు చేస్తామని తెలిపారు.

Updated Date - Feb 27 , 2024 | 11:00 AM