Share News

స్వేచ్ఛా ప్రపంచంలోకి సాయిబాబ

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:46 AM

మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబ నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో బాంబే హైకోర్టు రెండ్రోజుల కిందే ఆయనను నిర్దోషిగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

స్వేచ్ఛా ప్రపంచంలోకి సాయిబాబ

నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదల

కారాగారంలో నరకం అనుభవించా..

విడుదల అనంతరం సాయిబాబ

నాగ్‌పూర్‌, మార్చి 7: మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబ నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో బాంబే హైకోర్టు రెండ్రోజుల కిందే ఆయనను నిర్దోషిగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం జైలు నుంచి విడుదలై స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జైలు బయట వేచిచూస్తున్న తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంత క్రూరమైన జైలు జీవితం అనుభవించి ప్రాణాలతో బయటకు రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వీల్‌చైర్‌ నుంచి కదల్లేకపోయాను. సొంతంగా కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. జైల్లో నరకం అనుభవించాను’ అని ఆవేదన చెందారు. తనపై పెట్టిన కేసును ఓ కల్పిత కేసుగా కొట్టిపారేశారు. ‘సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా అన్యాయంగా మాపై కేసులు పెట్టారు. ఉన్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని చెప్పింది. దాదాపు 10 ఏళ్లు.. నన్ను, మరికొందరిని జైల్లో బందీ చేశారు. ఆ సమయాన్ని తిరిగి ఎవరిస్తారు..?’ అని ప్రశ్నించారు. ‘నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేను. వైద్య చికిత్స తర్వాత మీతో అన్ని విషయాలు మాట్లాడుతా..’ అని చెప్పారు2014లో అరెస్టు మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సాయిబాబతో పాటు మరో ఐదుగురిని 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2016 వరకు కొంతకాలం బెయిల్‌పైన బయటికొచ్చారు. ఇటు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు సాయిబాబతో పాటు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. దీంతో సాయిబాబ అప్పట్నుంచి నాగ్‌పూర్‌ జైల్లోనే ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసుపై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

Updated Date - Mar 08 , 2024 | 04:46 AM