Share News

CM Revanth Reddy : పాలితులు పాలకులు కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:40 AM

Telangana CM Revanth Reddy: బీసీ సమగ్ర కులగణనలో విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరంలేదని.. బలహీన వర్గాలను బలోపేతం చేయటమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంతకాలం పాలితులుగా ఉన్నవారిని రాబోయే రోజుల్లో పాలకులుగా తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. సమగ్ర కులగణనపై

CM Revanth Reddy : పాలితులు పాలకులు కావాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

బీసీల్ని అన్ని రంగాల్లో నిలబెట్టాలన్నదే లక్ష్యం

ఇన్నాళ్లూ పవర్‌లో ఉన్నోళ్లకు బాధ ఉండొచ్చు

కులగణనపై మాది తిరుగులేని చిత్తశుద్ధి

కేటీఆర్‌ సీటు మార్చటం కాదు.. బయటికే

అసెంబ్లీలో సమగ్ర కులగణన చర్చలో సీఎం

సంపూర్ణ సామాజిక ముఖచిత్రం

గణనతో అన్ని కులాల వివరాలు వెల్లడి

బలహీనవర్గాల్ని సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో నిలబెట్టాలి.. అదే మా ప్రభుత్వ ఉద్దేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): బీసీ సమగ్ర కులగణనలో విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరంలేదని.. బలహీన వర్గాలను బలోపేతం చేయటమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంతకాలం పాలితులుగా ఉన్నవారిని రాబోయే రోజుల్లో పాలకులుగా తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు. సమగ్ర కులగణనపై శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. బలహీనవర్గాలను సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 2014లో గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పటికీ.. ఇంతవరకు ఆ వివరాలను సభలో పెట్టలేదని, ప్రజాప్రతినిధులతోపాటు రాష్ట్ర ప్రజలెవరికీ అందుబాటులోకి తేలేదని సీఎం గుర్తుచేశారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒక రహస్య నివేదికలా వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల వివరాలను ఒకే కుటుంబం దగ్గర పెట్టుకున్నదని.. అవసరమైనప్పుడు రాజకీయం చేయాలనుకున్నపుడు మాత్రమే ఆ సర్వే వివరాలను వినియోగించుకున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ‘‘జనాభాలో అర శాతం ఉన్నోళ్లకు తప్పనిసరిగా కడుపులో బాధ ఉంటుంది. ‘అరశాతం ఉన్నోళ్లం ఇంతకాలం రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు లెక్కలన్నీ బయటికి వస్తే... 50 శాతం ఉన్నోళ్లకు ఎక్కడ రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందో’ అనే ఆలోచనతో కొంత మందికి బాధ ఉండొచ్చు!’’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆయన ఎవరిని సీఎం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి అయినాగానీ.. సలహాలు, సూచలను ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి చిత్తశుద్ధి పట్ల తమకెలాంటి అనుమానమూ లేదని... కాకపోతే సహవాస దోషంతోనే ఆయన ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కొంతమంది పక్కన కూర్చొని నకల్‌ చిట్టీలు అందిస్తూ వారిని కూడా తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ ను ఉద్దేశించి అన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘అయితే నా సీటు మార్చండి!’’ అన్నారు. దానికి సీఎం రేవంత్‌.. ‘‘మార్చాల్సిందే. సీటు మార్చితే సరిపోదు! ఏకంగా బయటికి పంపించాల్సిందే! గాలి సోకినా ప్రమాదం ఉంటుంది!’’ అన్నారు.

అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే..

పార్లమెంటులో జరిగిన చర్చలు, వచ్చిన ప్రశ్నలు, సమాధానాలు, సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో వచ్చిన తీర్పులు, గతంలో మైనారిటీ రిజర్వేషన్‌ సందర్భంగా సచార్‌ కమిటీ ఇచ్చిన నివేదికలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టాలనే ప్రయత్నం చేస్తున్నన్నట్టు సీఎం స్పష్టం చేశారు. రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు అమలులోకి తెచ్చినందుకే ఈరోజు రాష్ట్రం నుంచి 19 మంది ఎస్సీలు, 12 మంది ఎస్టీలు సభ్యులై చట్టసభకు వచ్చారని అన్నారు. ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు ఎంపీలై పార్లమెంటుకు వెళ్లారని అన్నారు. రాజేందర్‌ సచార్‌ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మద్దతు ఇవ్వటంతోపాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి విద్య, ఉద్యోగరంగాల్లో అమలుచేసిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. సమగ్ర కులగణన చేపట్టి సమాచారం సేకరించిన తర్వాత రాజకీయరంగంలో ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, జనాభా ప్రాతిపదికన అభివృద్ధి నిధులు కేటాయిస్తామని తెలిపారు. సభలో ఉన్న రాజకీయ పార్టీలతోపాటు సభలో లేని పార్టీలు కూడా సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించి కులగణన ప్రక్రియ చేపడతామని రేవంత్‌ అన్నారు. అంతేతప్ప అనుమానాలు లేవనెత్తుతూ, సభను తప్పుదోవపట్టిస్తూ, ప్రజలను అయోమయానికి గురిచేసేలా చేయొద్దని ప్రతిపక్షానికి హితవు చెప్పారు. మన రాష్ట్రంలో అన్నివర్గాల సమాచారం సేకరిస్తూనే వెనకబడిన తరగతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని, రాజకీయం, విద్య, ఉద్యోగరంగాల్లో ప్రభుత్వం అండగా నిలబడాలని పార్లమెంటు సభ్యులు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటమేరకు ఈ ప్రక్రియ చేపడుతున్నామని అన్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు, శాస్త్రీయ విధానాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. వెనకబడిన తరగతుల, షెడ్యూలు కులాల, షెడ్యూల్డు తెగలతోపాటు మిగిలిన బలహీనవర్గాలకు చెందిన వారికి సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈనెల నాలుగో తేదీన చేసిన సిఫారసు మేరకు సమగ్ర కుల గణన చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ఒకవేళ ఎన్నికల హామీలు, మానిఫెస్టోపై చర్చ చేయాలని ప్రధాన ప్రతిపక్షం భావిస్తే.. వచ్చే సమావేశాల్లో గానీ, ప్రత్యేక సమావేశాల్లోగానీ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు- అమలుచేసిన అంశాలతోపాటు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, ఈ 70 రోజుల్లో అమలు చేసిన పథకాలు, రాబోయే రోజుల్లో అమలుచేసే అంశాలపై ముందుకొస్తే మేనిఫెస్టో మీదనే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య శుక్రవారం సీఎం రేవంత్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆయన మంతనాలు జరిపినట్లు సమాచారం.

Updated Date - Feb 17 , 2024 | 07:04 AM