ఆర్టీసీ ఆదాయానికి గండి!
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:11 AM
బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యానికితోడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. లీజు బకాయిల వసూళ్లు చేపట్టకుండా అధికారులను నియంత్రించడంతో ఆర్టీసీ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు నిలిచిపోయాయి. టికెట్ చార్జీల చెల్లింపుల్లో కేవలం
కొన్నేళ్లుగా పేరుకుపోయిన లీజు బకాయిలు
ఏటా రావాల్సింది 100కోట్లపైనే
సగం కూడా వసూలు చేయని పరిస్థితి
బీఆర్‌ఎస్ హయాంలో ఒత్తిళ్లే కారణం
కాంగ్రెస్ వచ్చాక లీజుదారులకు నోటీసులు
లీజులు రద్దు, స్థలాల స్వాధీనానికి యత్నం
హైదరాబాద్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యానికితోడు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడింది. లీజు బకాయిల వసూళ్లు చేపట్టకుండా అధికారులను నియంత్రించడంతో ఆర్టీసీ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు నిలిచిపోయాయి. టికెట్ చార్జీల చెల్లింపుల్లో కేవలం రూ.10 వ్యత్యాసం వస్తేనే కండక్టర్లను సస్పెండ్ చేసే యాజమాన్యం.. లీజుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయకుండా ఏళ్ల తరబడి నుంచి చోద్యం చూడడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలోని స్టాళ్లను అద్దెకు ఇవ్వడం, స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీకి ఏటా 100 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కానీ, గత బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్య ధోరణి... కారణంగా సగానికిపైగా ఆదాయం నిలిచిపోయినట్టు తెలిసింది.
కొన్ని ఉదాహరణలు..
గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లో సిటీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల కోసం ఆర్టీసీతో గో రూరల్ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 2015 సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు రూ.22కోట్లు చెల్లించాలి. కానీ, గడువులోగా బకాయిలను వసూలు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ రీజియన్‌కు రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్‌కు రూ.10.98 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గడువులోగా చెల్లించని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోకుండా అప్పటి అధికారపార్టీ నేతలు అడ్డుపడినట్టు తెలిసింది. ఇక, ఎంజీబీఎ్‌సలో స్టాళ్ల కేటాయింపులో సైతం అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులున్నాయి. ఆర్టీసీ కళామండపం లీజు విషయంలోనూ ఇదే తంతు చోటు చేసుకుంది. ఏళ్ల తరబడి నిర్వహణ బాధ్యతలు పొందిన అధికార పార్టీ నేతలు సుమారు రూ.8కోట్లకుపైగా ఎగవేసినట్టు అధికారులు తెలిపారు. ఇక, నిజామాబాద్‌లో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని వాణిజ్య సముదాయాన్ని నిర్మించి, అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్న రాజకీయ నాయకుడిపై చర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. కరీంనగర్, నల్లగొండ, రాణిగంజ్, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలు, భవనాల లీజుదారుల నుంచి భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు. బకాయిల వసూళ్ల కోసం లీజుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. లీజుదారులు స్పందించని పక్షంలో ఒప్పందాలను రద్దు చేసి, స్థలాలు, నిర్మాణాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.