Share News

3 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:12 AM

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

3 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ

ఇదే వ్యవధిలో పనులకు టెండర్లు

అధికారులకు రేవంత్‌రెడ్డి ఆదేశాలు

1935.35 హెక్టార్ల భూసేకరణ లక్ష్యం

1459.28 హెక్టార్ల సేకరణ పూర్తి

గత సర్కారు ధోరణితో పనుల్లో జాప్యం

పట్టాలెక్కించాలని ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని.. నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో దావోస్‌ పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అవతల నిర్మించతలపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్‌లో పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌ మాల పరియోజన ఫేజ్‌ వన్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ (నార్త్‌) 158.645 కి.మీ.ల మేర నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు కోసం 1935.35 హెక్టార్ల భూసేకరణ జరపాల్సి ఉండగా ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి.

గత ప్రభుత్వ సహాయ నిరాకరణ ఽకారణంగా కొంతకాలంగా భూసేకరణలో ఎలాంటి పురోగతి లేదని, నేషనల్‌ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ)తో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నాలూ జరగలేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సత్వరం ఈ ప్రాజెక్టును పట్టాల మీదికి ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఓఆర్‌ఆర్‌ లోపల అర్బన్‌ క్లస్టర్‌, ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో సెమీ అర్బన్‌ క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వెలుపలి ప్రాంతాన్ని రూరల్‌ క్లస్టర్‌గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అంశంపై సీఎం అధికారులతో చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తయితే కొత్త రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్‌ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. నిలిచిపోయిన భూసేకరణను రానున్న మూడు నెలల్లో పూర్తి చేయాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ (నార్త్‌) పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (సౌత్‌) ప్రాజెక్టును జాతీయ రహదారిగా ప్రకటించాలని, ఆ తర్వాత భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 07:13 AM