Share News

రోడ్డు ప్రమాదాలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:09 PM

రహదారి భద్రత పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ హర్శవర్ధన్‌ అన్నారు.

 రోడ్డు ప్రమాదాలు
సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న వైద్యులు

- ఎస్పీ హర్షవర్ధన్‌ - అవగాహన కోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కె రన్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 29 : రహదారి భద్రత పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ హర్శవర్ధన్‌ అన్నారు. రోడ్డుపైకి వచ్చే వాహనదారులు నియమనిబంధనలు పాటించాలని కోరారు. రహదారి భద్రత, ప్రమాదాల నివారణ, సీపీఆర్‌పై అవగాహన కోసం గురువారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కె రన్‌ నిర్వహించారు. పోలీస్‌ పరేడ్‌ మైదానం వద్ద ఎస్పీ హర్శవర్ధన్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎక్కడో ఓ చోట నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్‌ విధిగా ధరించాలని, రోడ్డుపై సైనింగ్‌ బోర్డు సూచనలు పాటించాలని కోరారు. సేఫ్టీగా వాహనాలు నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, కారు నడిపేవాళ్లు సీట్‌బెల్ట్‌ ధరించాలని సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్‌ చేయవద్దని, పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలో ఉన్నవారికి సీపీఆర్‌ నిర్వహించి వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడవచ్చో అవగాహన కల్పించారు. ఇటీవల సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది రామ్‌గోవర్దన్‌, వెకట్‌కుమార్‌, డాగ్‌స్క్వాడ్‌ రఘు, డ్రైవర్‌ శివలను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌ చిత్తరంజన్‌, అదనపు ఎస్పీ ఎ.రాములు, ఏఆర్‌ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:09 PM