ఆరోగ్యశ్రీకి పునర్వైభవం’
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:43 AM
ఆరోగ్యశ్రీకి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు... ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న చికిత్సలకు అదనంగా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి రానివాటిని, అత్యంత ఖరీదైన, కీలకమైన ఎక్మో, రోబోటిక్ సర్జరీ సహా 65 ప్రొసీజర్స్‌ను జోడించాలనే సూత్రప్రాయ
ఎక్మో, రోబోటిక్ సర్జరీలు సహా 65 ప్రొసీజర్ల చేర్పు
ఆయుష్మాన్ భారత్‌లో లేని చికిత్సలు ఇందులోకి
ధరల సవరణ.. ప్రాంతాలవారీ వ్యాధుల మ్యాపింగ్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు తెలిపేలా ప్రచారం
బడ్జెట్ భేటీల్లో సమావేశాల్లో ప్రకటించనున్న సర్కారు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీకి పునర్ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు... ప్రస్తుతం ఈ పథకం కింద అందిస్తున్న చికిత్సలకు అదనంగా ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి రానివాటిని, అత్యంత ఖరీదైన, కీలకమైన ఎక్మో, రోబోటిక్ సర్జరీ సహా 65 ప్రొసీజర్స్‌ను జోడించాలనే సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం నిమ్స్‌లో ఎక్మో, రొబోటిక్ సర్జరీలు చేస్తున్నప్పటికీ... అవి ఆరోగ్యశ్రీ పరిఽధిలోకి రావట్లేదు. ఇకపై అవి కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీలో పెరగనున్న ప్రొసీజర్స్, తీసుకురానున్న మార్పుల గురించి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. కాగా కొత్తగా కలిపే ఈ 65 ప్రొసీజర్స్‌తో పాటు ఇంకేవైనా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవచ్చా అనే అంశంపై నివేదిక రూపొందించి ఇవ్వాలని వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ తీరుతో ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా దెబ్బతిన్నదని సర్కారు భావిస్తోంది. సకాలంలో ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం, పాతకాలం నాటి ప్యాకేజీ ధరలనే కొనసాగించడం వల్ల ప్రైవేటు ఆస్పత్రులు ఈ పథకం కింద చికిత్సలు అందించడం నిలిపివేశాయి. కార్పొరేట్ ఆస్పత్రులైతే ఆరోగ్యశ్రీ వార్డులనే ఎత్తివేశాయి. ఆస్పత్రులకు ఇచ్చే పెండింగ్ బకాయిలు రూ.వందల కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలోనే సర్కారు ఆరోగ్యశ్రీపై దృష్టి సారించింది.
ప్యాకేజ్ ధరల మార్పు...
గత సర్కారు హయంలో ఆరోగ్యశ్రీ పరిమితి ఒక్కో కుటుంబానికీ ఏడాదికి రూ.5 లక్షల దాకా ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయం కింద దాన్ని రూ.10 లక్షలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండింటిని కలిపి అమలుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1399 నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆస్పత్రులే. ప్రైవేటు ఆస్పత్రులు దాదాపు 400 దాకా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద 1670 రకాల వైద్య చికిత్సలను అందిస్తున్నారు. అయితే.. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఖరారు చేసిన ప్యాకేజ్ ధరలనే సర్కారు ఇప్పటికీ ఇస్తోంది. మధ్యలో కొన్నింటికి 10ు మేర ధరలు పెంచినప్పటికీ.. మిగతావాటికి పాత రేట్లే ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను దూరం పెడుతున్నాయి. ప్రజలకు సైతం ఆరోగ్యశ్రీపై నమ్మకం పోయింది. తిరిగి వారిలో నమ్మకం కల్పించాలనే యోచనలో ఉన్న సర్కారు.. సేవల సంఖ్యను, ప్యాకేజ్ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే.. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఒక తరహా జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి. ఏయే వ్యాధులు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయో గుర్తించేందుకు డిసీజ్ మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కువగా ఒకే తరహా జబ్బులు నమోదయ్యే చోట చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. దీంతో పాటు సర్కారీ దవాఖానాల్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ప్రజలకు తెలిపే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను సర్కారు ఆదేశించింది. ఏ ఆస్పత్రిలో ఏ సేవ అందుబాటులో ఉందో తెలియడం వల్ల స్థానికంగా ఉండేవారంతా అక్కడే చికిత్స చేయించుకుంటారని.. ఫలితంగా హైదరాబాద్‌లోని నిమ్స్, ఇతర పెద్దాసుపత్రులపై భారం తగ్గుతోందని యోచిస్తోంది.