Share News

దేవుళ్ల పేరుతో రేవంత్‌ డ్రామా

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:41 AM

: దేవుళ్ల పేరుతో ప్రమాణాలు చేస్తూ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మరో డ్రామాకు తెరలేపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని

దేవుళ్ల పేరుతో రేవంత్‌ డ్రామా

ప్రమాణాలు చేస్తూ మభ్య పెడుతున్నారు

ఓట్ల కోసమే మరోసారి రుణమాఫీ హామీ

విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు: సంజయ్‌

ఎల్కతుర్తి/హుస్నాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 22: దేవుళ్ల పేరుతో ప్రమాణాలు చేస్తూ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మరో డ్రామాకు తెరలేపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని ఓటర్లను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సంజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యమంటూ క్వింటాకు 10 కిలోల వరకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, మిల్లర్లు కుమ్మకై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సర్కారు మాటలు వార్తా పత్రికలకే పరిమితమవుతోందని విమర్శించారు. వరి ధాన్యానికి రూ.500 బోన్‌సతో పాటు ఇతర పంటలకు బోనస్‌ ఇవ్వడానికి రూ.5 వేల కోట్లు కావాలన్నారు. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనాలంటే ప్రభుత్వంపై రూ.700 కోట్లు భారం పడుతుందన్నారు. తక్కువ బడ్జెట్‌ ఖర్చయ్యే ఈ రెండు హామీలనే అమలు చేయని వారు.. ఆగస్టు 15 లోపు రూ.30వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఐపీల్‌ కెప్టెన్‌ మోదీ..

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికలు ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌ మ్యాచ్‌ అని.. ఇందులో బీజేపీ కెప్టెన్‌ మోదీ అని బండి సంజయ్‌ అన్నారు. విపక్ష పార్టీల్లో ఇంత వరకు ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేలలేదన్నారు. కెప్టెన్‌ లేకుండా లీగ్‌మ్యాచ్‌ నడుస్తుందా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉంటే దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాజా, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు బీజేపీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీలకు నేరుగా చేరాల్సిన కేంద్రం నిధులను బీఆర్‌ఎస్‌ దారి మళ్లించి సర్పంచులను బిచ్చగాళ్లుగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. నిత్యం తనను తిట్టే హుస్నాబాద్‌ ఎమ్మెల్యే.. ఆ నియోజకవర్గంలో ఎంత మందికి ఆరు గ్యారెంటీలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, హుస్నాబాద్‌లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన బండి సంజయ్‌కి అంబేడ్కర్‌ చౌరస్తాలో గిరిజనులు, కార్యకర్తల ఘనస్వాగతం పలికారు.

Updated Date - Apr 23 , 2024 | 04:41 AM