Former Minister Harish Rao : రేవంత్ జూటా సీఎం
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:46 AM
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు కేసీఆరే సంతకం చేశారంటూ సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక, బూతులతో బుల్డోజ్ చేసేందుకు రేవంత్ యత్నించారని,
రేవంత్ ఝూటా సీఎం’
ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే
ఈ అంశంపై కేసీఆర్ ఎక్కడా సంతకం చేయలే
పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్ట్‌ను వ్యతిరేకించాం
ఎవర్ని చెప్పుతో కొట్టాలో రేవంతే జవాబివ్వాలి
రేవంత్‌ది సంస్కారం లేని భాష, అహంకారం
ప్రాజెక్టులిచ్చి భవిష్యత్తు తాకట్టు పెట్టొద్దు: హరీశ్
మాకూ ముతక కూతలొచ్చు: జగదీశ్, ప్రశాంత్
కేసీఆర్‌నే దూషిస్తావా.. బుద్ధి ఉందా?: కడియం
చెత్త సీఎంను చెప్పుతో కొడతా: బాల్క సుమన్
చెప్పు చూపిస్తూ పరుష పదజాలంతో దూషణ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు కేసీఆరే సంతకం చేశారంటూ సచివాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక, బూతులతో బుల్డోజ్ చేసేందుకు రేవంత్ యత్నించారని, అబద్ధాల పునాదులపై పాలన సాగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం హరీశ్ మాట్లాడారు. ‘‘కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనవరి 17న జరిగిన సమావేశంలో రాష్ట్ర అధికారులే చెప్పారు. అదే విషయాన్ని ఈఎన్‌సీ ప్రకటించారు. నెల రోజుల్లో ప్రాజెక్టులను అప్పగించాలని, సీఆర్పీఎఫ్ అనుమతితోనే ప్రాజెక్టుల వద్దకు ఇంజినీర్లు వెళ్లాలని, నిర్వహణ బాధ్యత రెండు రాష్ర్టాలదని పేర్కొంటూ ఆ తర్వాత కేంద్రం వెల్లడించిన మినిట్స్‌లోనూ ఉంది. దీనిపై 19న నేను ప్రెస్‌మీట్ పెట్టి ప్రశ్నించే వరకూ మంత్రులకు సోయి లేదు. ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని.. అప్పుడు గుర్తించారు. పదేళ్లలో కేఆర్‌ఎంబీకి తాము ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పని చేశారు’’అని విమర్శించారు. ఇదంతా నిజం కాకుంటే ఉద్యోగులు, వారి జీతాల చెల్లింపు వరకు చర్చ ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేఆర్‌ఎంబీకి చెందిన 16, 17వ సమావేశాల్లో తెలంగాణ ఒప్పుకోలేదని మినిట్స్ కాపీలోనే ఉందంటూ.. అందులోని అంశాలను చదివి వినిపించారు. ఆ సమావేశానికి హాజరు కాని అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ఎలా సంతకాలు చేస్తారని ప్రశ్నించారు. తప్పును ఒప్పుకోకుండా.. గత ప్రభుత్వమే ఒప్పుకొందంటూ అబద్ధాలు చెబుతున్నారని.. ఇంతకన్నా జుటా సీఎం ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌కు స్ర్కిప్ట్ రాసిస్తున్న వారు అబద్ధాలనే రాసిస్తున్నారని, ఆయన్ను తప్పుదోవ పట్టించకుండా సరైన సమాచారం ఇస్తే బాగుటుందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దని కోరారు. రేవంత్ అబద్ధాలకు తాను ఇస్తున్న వివరణ శాంపిల్ మాత్రమేనని, అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు చెబుతామని, పూర్తి సినిమా ముందుందన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రిపేర్ అయి రావాలని, గతంలో మాదిరిగా అడ్డంగా దొరికిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.
రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకించాం
పోతిరెడ్డిపాడు విషయంలో పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారంటూ రేవంత్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని హరీశ్ స్పష్టం చేశారు. 2005 జూలై 4న తాము మంత్రి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ సర్కారు నుంచి బయటకు వచ్చామని, అదే ఏడాది సెప్టెంబర్ 13న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతిరెడ్డి పాడుపై జీవో తెచ్చిందన్నారు. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్‌దని, ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే లాగా తమపై నిందలు వేయడం తగదన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ను కేసీఆర్ వ్యతిరేకించారని, రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు.. ఎవర్ని చెప్పులతో కొట్టాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు కేంద్రంలో అఽధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలే విభజన చట్టం రూపొందించారని, బిల్లులోని అంశాల గురించి తెలుసుకోకుండా వితండవాదం చేయడం తగదన్నారు. మితిమీరిన అహంకారం, అబద్ధాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపించాయని హరీశ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పట్ల నీచమైన భాషలో దూషణలకు పాల్పడ్డారన్నారు. ఆయన ధోరణి చూసి ఒక సీఎం ఇలా మాట్లాడతారా? అని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంలోనే నీళ్లు బాగుండేవని, తెలంగాణ వచ్చాక అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు అమరుల త్యాగాలను తప్పుపట్టేలా ఉన్నాయని హరీశ్ ఆరోపించారు. నాడు కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాలను తమ ప్రభుత్వం సరి చేసిందని పేర్కొన్నారు.