Share News

రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:29 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై వివిధ పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి! ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతున్నాయని, సూత్రధారులను, దోషుల్ని తప్పించి ఈ కేసును

రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లవి డ్రామాలు

దోషుల్ని తప్పించే యత్నాలు: లక్ష్మణ్‌

కేంద్ర ప్రభుత్వమే సుమోటోగా తీసుకోవాలి: మంత్రి దుద్దిళ్ల

దీనివెనుక ఎవరున్నా వదలం: పొంగులేటి

ఈ కేసులో కేసీఆర్‌కూ జైలుజీవితం తప్పదు: కొండా సురేఖ

హైదరాబాద్‌, పటాన్‌చెరు రూరల్‌, రంగారెడ్డి అర్బన్‌/మహేశ్వరం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై వివిధ పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి! ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతున్నాయని, సూత్రధారులను, దోషుల్ని తప్పించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని, సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్‌ సవాల్‌ చేశారు!! దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని, కేసీఆర్‌ ఆదేశాల మేరకే పోలీసులు ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు. గత పాలకులు ఇచ్చిన చనువుతో ఒక అడుగు ముం దుకేసిన పోలీసులు.. ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, బంగారు ఆభరణాల వర్తకులను కూడా వదలకుండా వారి నుంచి డబ్బు వసూలు చేశారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం దేశభద్రతను, వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. పోలీసులు తమ వాహనాల్లో డబ్బును తరలించి, బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌ను గతంలో కేసీఆర్‌ సర్కారు ఓటుకు నోటు కేసులో ఇరికించి జైలుకు పంపినా.. పోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ఆయన ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారో అంతుబట్టట్లేదన్నారు. కాంగ్రెస్‌ సర్కా రు ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీజేపీ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి జోక్యం కోరతామన్నారు. అయితే.. లక్ష్మణ్‌ విమర్శలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పందించారు. నాటకాలు ఆడుతున్నది బీఆర్‌ఎస్‌, బీజేపీలేనని, ఇండియన్‌ టెలికం చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా ఎవరి ఫోన్‌ ట్యాప్‌ చేసినా, నేరుగా కేంద్ర ప్రభుత్వమే చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయంలో కేంద్రమే తనకున్న అధికారాలను ఉపయోగించుకుని ఈ కేసును సుమోటోగా తీసుకుని చర్యలు ఎందుకు చేపట్టట్లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక ఎంతపెద్ద తురుమ్‌ఖాన్‌లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హెచ్చరించారు. ఈ కేసులో దొంగలు ఎవరు అంటే.. భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికీ అవసరం లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఇక.. ఈ కేసులో కేసీఆర్‌కు సైతం జైలు జీవితం తప్పదని మంత్రి కొండా సురేఖ అన్నారు. లిక్కర్‌ కేసులో కవితను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

పోలీసుల దిగజారుడుకు నిదర్శనం: సీపీఐ

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసుల దిగజారుడు విధానాలకు అద్దం పడుతోందని.. పోలీసుల చర్య హేయమైనదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా డబ్బు తరలించిన వైనంపై ఈసీ విచారణ చేపట్టాలన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని అక్రమార్కులను చట్టబద్ధంగా శిక్షించాలని కోరారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అనైతిక కార్యకలాపాలకు పాల్పడడంకంచే చేను మేసిన చందంగా ఉందని ఆయన వాపోయారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందూ ఒక వాహనాన్ని పెట్టి గత బీఆర్‌ఎస్‌ సర్కారు ఆయన ఫోన్‌ను ట్యాప్‌ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు.

Updated Date - Apr 04 , 2024 | 05:29 AM