Share News

ఆర్‌ అండ్‌ బీలో రోడ్స్‌ ఈఎన్సీ రాజీనామా

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:57 AM

రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖలోని రహదారుల విభాగం ఇన్‌చార్జి ఈఎన్సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) పి.రవీందర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు.

ఆర్‌ అండ్‌ బీలో రోడ్స్‌ ఈఎన్సీ రాజీనామా

ప్రభుత్వ ఆమోదం.. ఆలస్యంగా వెలుగులోకి

రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ పోస్టు నుంచీ రిలీవ్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖలోని రహదారుల విభాగం ఇన్‌చార్జి ఈఎన్సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) పి.రవీందర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం.. రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బాధ్యతల నుంచి కూడా ఆయన్ను రిలీవ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మార్చి 14నే జారీ అయ్యాయి. కానీ, ఈ అంశం ఆలస్యంగా బయటికొచ్చింది. అయితే, రహదారుల విభాగానికి ఈఎన్సీగా ఎవరు వస్తారనే విషయం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వివిధ శాఖలకు చెందిన కొందరు అధికారులు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. కొందరు రాజీనామాలు చేస్తుంటే, కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్‌ అండ్‌ బీలోని రహదారుల విభాగం ఇన్‌చార్జి ఈఎన్సీ రవీందర్‌రావు, భవనాలు, నేషనల్‌ హైవేస్‌ విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి తమను పదవుల నుంచి రిలీవ్‌ చే యాలని గత ఏడాది డిసెంబరులోనే ఆ శాఖ సెక్రటరీకి లేఖలు పంపారు. అదే సమయంలో శాఖకు కొత్త మంత్రి రావడంతో వారి ప్రతిపాదన పెండింగ్‌లో ఉండిపోయింది. చివరికి రవీందర్‌రావు రాజీనామాకు ఆమో దం లభించింది. ఇక భవనాలు, నేషనల్‌ హైవేస్‌ విభాగం ఈఎన్సీ గణపతి రెడ్డి అంశంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన సచివాలయం, అమరుల స్థూపం, అంబేడ్కర్‌ విగ్రహం ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ భవనాల విభాగం పరిధిలోకే వస్తాయి. దాంతో గణపతిరెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

Updated Date - Mar 24 , 2024 | 05:57 AM