Share News

భర్తీ ఎప్పుడో..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:23 PM

జిల్లాలో అంగన్‌వాడీల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా? అని అర్హులు ఎదురు చూస్తున్నారు. మహిళా, శిశు సంరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో అనేక పోస్టులు ఇంకా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వివిధ కారణాల రీత్యా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖాళీ అయిన అంగన్‌వాడీ కేంద్రాలను పలుచోట్ల ఇంచార్జీలే నడిపిస్తున్నారు. దీంతో అనేక కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్ఠికాహారం సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భర్తీ ఎప్పుడో..?

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీకి కలగని మోక్షం

జిల్లాలో దర్శమిస్తున్న 107 ఖాళీలు

అత్యధిక పోస్టులు ఆయాలే

ఖాళీ ఉన్న చోట ఇన్‌చార్జీలే దిక్కు

పనిభారంతో అవస్థలు పడుతున్న అంగన్‌వాడీలు

జిల్లాలో అంగన్‌వాడీల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా? అని అర్హులు ఎదురు చూస్తున్నారు. మహిళా, శిశు సంరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో అనేక పోస్టులు ఇంకా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, పిల్లలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వివిధ కారణాల రీత్యా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖాళీ అయిన అంగన్‌వాడీ కేంద్రాలను పలుచోట్ల ఇంచార్జీలే నడిపిస్తున్నారు. దీంతో అనేక కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పౌష్ఠికాహారం సక్రమంగా అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 30 : జిల్లాలో 27 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లలో 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 1,577 మంది అంగన్‌వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. 25 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1,380 అంగన్‌వాడీ ఆయా పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 1,273 మంది పనిచేస్తున్నారు. 107 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే ఆమనగల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో 232 అంగన్‌వాడీ టీచర్లు ఉండాల్సి ఉండగా 227 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో 225 టీచర్‌ పోస్టులకు 250 మంది, హయత్‌నగర్‌ ప్రాజెక్టు పరిధిలో 181 పోస్టులకుా 178మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇక, ఇబ్రహీంపట్నం ప్రాజెక్టులో 162 టీచర్‌ పోస్టులకు గాను 158 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహేశ్వరం ప్రాజెక్టులో 234మందికి 232 మంది టీచర్లు పనిచేస్తున్నారు. శేరిలింగంపల్లి ప్రాజెక్టులో 220మంది టీచర్లు పనిచేయాల్సి ఉండగా ఇక్కడ కేవలం 217 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. షాద్‌నగర్‌ ప్రాజెక్టు పరిధిలో 316 టీచర్‌ పోస్టులకు గాను 313 మంది టీచర్లు పనిచేస్తున్నారు.

అధిక ఖాళీల్లో ఆయా పోస్టులే...

జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల కంటే ఆయా పోస్టులే ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆమనగల్లులో 160 పోస్టులకు 151 మంది ఆయాలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇక, చేవెళ్ల ప్రాజెక్టులో 216మందికి 196 మంది, హయత్‌నగర్‌ ప్రాజెక్టులో 177మందికి 166 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో 144 పోస్టులకు 135 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మహేశ్వరంలో 209 మందికి 187 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ జిల్లాలోనే అత్యధికంగా 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలో 212 పోస్టులకు గాను 193 మంది, షాద్‌నగర్‌లో 265 పోస్టులకు 245మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 17 మంది ఆయా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

పెరుగుతున్న పనిభారం..

అంగన్‌వాడీ టీచర్‌కు నెలకు 13,650, ఆయాకు 7,800 రూపాయల గౌరవ వేతనంగా అందజేస్తున్నారు. అయితే, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఈ వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు. అదేవిధంగా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి సిబ్బంది లబ్ధిదారులకు పౌష్ఠికాహారం సక్రమంగా అందించలేకపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా, శారీరకంగా బలహీనం కాకుండా ఉండేందుకు గాను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లతో పాటు ఆకుకూరలు, ఇతరత్రాల కూరలతో కూడుకున్న పౌష్ఠికాహారాన్ని వీరు అందించాల్సి ఉంది. కానీ, సిబ్బంది సరిపోను లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు వీరిని ఆరోగ్య సర్వేలు, ఇతరత్రా సర్వేల బాధ్యతలను ఎక్కువగా వీరికే అప్పగిస్తున్నారు. అలాగే టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్కగల కేంద్రాల టీచర్లకు అప్పగించడం వల్ల తమపై అదనపు పనిభారం పడుతుందని అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి సర్వే బాధ్యతలు అప్పగించినప్పుడు కేంద్రాలు కూడా తొందరగానే మూత పడుతున్నాయని. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పడిన టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.

ఇంటర్‌ ఉంటేనే అంగన్‌వాడీ పోస్టు..

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌, వర్కర్‌ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటి వరకు పదో తరగతి అర్హతగా ఈ పార్ట్‌టైమ్‌ నియమకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్‌ అర్హతగా నిర్ణయించింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:24 PM