Share News

రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:59 AM

నిప్పుల కొలిమిని తలపిస్తూ.. నిరుటిని మించి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.

రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): నిప్పుల కొలిమిని తలపిస్తూ.. నిరుటిని మించి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కాలు బయటపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ ఏడాది ఇప్పటికి ఇదే అత్యధికం. వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లోనూ 45 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితేనే ఈ హెచ్చరిక జారీ చేస్తారు. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, హన్మకొండ, వరంగల్‌, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నిర్మల్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి. వీటికి రాబోయే మూడు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

అన్ని జిల్లాల్లోనూ సోమవారం వరకు ఉష్ణోగ్రతలు సగటున 43- 47 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. పొడి వాతావరణం వల్ల గతం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది.


అత్యవసరమైతేనే బయటకు రండి..

శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11- సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. శనివారం నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాలులుంటాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ ప్రకటించింది. ఆది, సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. అయితే, ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం మంథని (పెద్దపల్లి) 45.2, నిడమానూరు (నల్లగొండ) 45.2, మర్యాల (యాదాద్రి) 45.1, వీణవంక (కరీంనగర్‌) 45.1, వెల్గటూరు 45.1, కొల్వాయి (జగిత్యాల), 45.1, మాటూర్‌ (నల్లగొండ) 45, కోనాయిపల్లి (వనపర్తి) 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ 44 డిగ్రీలు దాటింది.


గంటకు 2 డిగ్రీల చొప్పున పెరుగుదల

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గంటకు సగటున రెండు డిగ్రీల చొప్పున పెరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే 30 డిగ్రీలకు చేరుతోంది. పది గంటలకు 34-36 డిగ్రీలకు, 12 కొట్టేసరికి 40కు వెళ్తోంది.

తర్వాత రెండు, మూడు గంటల్లోనే మరో 4-5 డిగ్రీలు పెరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు వరకు ఇదే తీవ్రత ఉంటోంది.

సాయంత్రం ఆరు గంటల వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. కాగా, శనివారం వడదెబ్బతో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం అచ్చన్నపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం కూలీ శంకర్‌ సదా (33) మృతిచెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు టీచర్‌ బోడ అశ్రిత (35) సైతం వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయింది. బజారుకు వెళ్లి వచ్చిన అశ్రిత అస్వస్థతకు గురైంది.

రాయలసీమ, తెలంగాణలో తీవ్రత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: రానున్న ఐదు రోజుల్లో తూర్పు, దక్షిణ భారతంలో మోస్తరు నుంచి తీవ్ర వడగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరించింది. బిహార్‌, జార్ఖండ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా కర్ణాటక, తమిళనాడు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంత వేడిగా ఉంటుందని ఐఎండీ అధికారి డీఎస్‌ పాయ్‌ అంచనా వేశారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2023 రికార్డుని అధిగమించొచ్చని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 06:00 AM