మేళ్లచెర్వు సర్పంచ్ నుంచి 1.99 కోట్లు రికవరీ చేయండి
ABN , Publish Date - Jan 27 , 2024 | 03:42 AM
అక్రమాలకు పాల్పడిన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు సర్పంచ్ పందిర్లపల్లి శంకర్‌రెడ్డి నుంచి రూ.1.99 కోట్లు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆదేశాలు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం
సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు
అక్రమాలు జరిగినట్లు డీఎల్‌పీవో నిర్ధారణ
అధికారుల సూచన మేరకే ఖర్చు: సర్పంచ్
మేళ్లచెర్వు, జనవరి 26: అక్రమాలకు పాల్పడిన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు సర్పంచ్ పందిర్లపల్లి శంకర్‌రెడ్డి నుంచి రూ.1.99 కోట్లు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 45 రోజుల్లో సొమ్మును రికవరీ చేయాలని తహసీల్దార్ జ్యోతిని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ ఆ ఉత్తర్వులను సర్పంచ్ పందిర్లపల్లి శంకర్‌రెడ్డికి శుక్రవారం నేరుగా అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మేళ్లచెర్వు గ్రామపంచాయతీలో 16 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన 12 మంది, కాంగ్రెస్ బలపరిచిన నలుగురు వార్డు సభ్యులుగా గెలుపొం దారు. సర్పంచ్‌గా పందిర్లపల్లి శంకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించగా, ఆయన తీరు నచ్చక నలుగురు బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రె్‌సలో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన 8 మంది వార్డు సభ్యులు.. సర్పంచ్ శంకర్‌రెడ్డి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పంచాయతీ నిధులు ఖర్చు చేశారని, నోటీసు బోర్డులో పెట్టకుండా ఏకపక్ష నిర్ణయాలతో అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈనెల 4న డీఎల్‌పీవో సాంబిరెడ్డి ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, ఇతర ఆడిటర్లతో కూడిన కమిటీ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకుంది. రికార్డుల పరిశీలనలో పంచాయతీ సాధారణ నిధుల నుంచి రూ.92.66 లక్షలు, 14, 15వ ఆర్థిక సంవత్సర నిధుల నుంచి రూ.63.30 లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.43.16 లక్షలు.. మొత్తం రూ.1.99 కోట్లు సర్పంచ్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. కాగా, సర్పంచ్ శంకర్‌రెడ్డి వ్యవహారశైలిపై స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. అప్పటి అధికార బీఆర్‌ఎ్‌సలో ఉండటంతో పాటు ఓ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితుడని ప్రచారంతో మౌనం వహించిన వారంతా ఇప్పుడు నోరు విప్పుతున్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లకు ఐదేళ్లుగా ప్రతీ ఏటా పంచాయతీ నిధులు రూ.10 లక్షల చొప్పున రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు చూపించారని.. జాతర కోసం గతేడాది ప్రభుత్వం కేటాయించిన రూ.50 లక్షల నిధుల ఖర్చుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అన్ని బిల్లులున్నాయి.. విచారణకు సిద్ధం
శివరాత్రి వేడుకలు, పల్లె ప్రకృతి వనాలకు నిధులను సంబంధిత అధికారుల సూచనల మేరకు ఖర్చు చేశాం. ఇందులో నా ప్రమేయం ఏమీలేదు. అన్నింటికీ బిల్లులున్నాయి. ఏ విచారణకైనా సిద్ధం..
- శంకర్‌రెడ్డి, మేళ్లచెర్వు సర్పంచ్