భూకేటాయింపు ఒప్పందం, సేల్‌డీడ్ రద్దు సబబే!
ABN , Publish Date - Mar 08 , 2024 | 04:48 AM
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఐఎంజీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అందుకు సంబంధించిన సేల్‌డీడ్‌ను రద్దు చేయడం సబబేనని హైకోర్టు పేర్కొంది.
ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించిన హైకోర్టు
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ కొట్టివేత
అత్యంత విలువైన 850 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే!
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఐఎంజీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని, అందుకు సంబంధించిన సేల్‌డీడ్‌ను రద్దు చేయడం సబబేనని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఒప్పందాన్ని అమలు చేయాలని, ప్రత్యేక చట్టం ద్వారా ఒప్పందాన్ని, సేల్‌డీడ్‌ను రద్దు చేయడం చెల్లదని పేర్కొంటూ ఐఎంజీ భారత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అత్యంత విలువైన 850 ఎకరాల భూమి ప్రభుత్వపరం కావడం విశేషం. ఐఎంజీ భారత్ కంపెనీ 2003 ఆగస్టు 5న కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైంది. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్ కంపెనీని క్రీడాసౌకర్యాల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణలో నైపుణ్యం కలిగిన కంపెనీగా గుర్తించి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి గ్రామం సర్వే నంబర్ 99 /1 లో 450 ఎకరాలు, హెడ్‌కార్టర్స్ నిర్మాణానికి బంజారాహిల్స్ నుంచి శిల్పారామం ప్రధాన రహదారిలో ఒక ఎకరం నుంచి 5 ఎకరాల భూమి కేటాయించేందుకు ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. రూ.50 వేలకు ఎకరం చొప్పున 400 ఎకరాలను రిజిస్ట్రర్డ్ సేల్‌డీడ్ ద్వారా అప్పగించింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2006లో ఎంవోయూ, సేల్‌డీడ్ రద్దుకు ఆర్డినెన్స్ 12 ఆప్ 2006ను తీసుకొచ్చింది. తర్వాత సదరు అడ్డినెన్స్ యాక్ట్ 11 ఆఫ్ 2007 ఆంఽధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రిసంప్షన్ ) చట్టం-2007గా ఆమోదించింది. పిటిషనర్ కంపెనీతో చేసుకున్న ఎంవోయూ, సేల్‌డీడ్, ఇతర రాయితీలను రద్దుచేసింది. కాగా ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని.. దానిని కొట్టేయాలని పిటిషనర్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడం ద్వారా 850 ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించిన ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు. రూ. వందల కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 3.12 కోట్లకు దక్కించుకుందని ఆరోపించారు. భూ కేటాయింపు ఒప్పందం డ్రాఫ్ట్‌లను అప్పటి క్యాబినెట్ సబ్‌కమిటీకి సర్క్యులేట్ చేయడం సహా యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చరల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి దాకా కేవలం ఒకే ఒక్క రోజులో ఫైల్ క్లియర్ అయిందని పేర్కొన్నారు. 2003 ఆగస్టు 9న ఎంవోయూ జరగ్గా అంతకంటే ఐదురోజుల ముందే ఐఎంజీ అకాడమీస్ భారత్ కంపెనీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. భూములను కంపెనీ పేరిట సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేనాటికి రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉందని.. పబ్లిక్ ప్రాపర్టీని కొల్లగొట్టే ఉద్దేశంతోనే కంపెనీ ఏర్పడిందని ఆరోపించారు. ఐఎంజీ వరల్డ్‌వైడ్ కంపెనీలో భాగమైన అమెరికాలోని డెలావేర్ రాష్ట్రానికి చెందిన ఐఎంజీ అకాడమీస్ ఈస్ట్ లిమిటెడ్‌కు 100 శాతం సబ్సిడరీ కంపెనీ అని పేర్కొన్నారని..అమెరికా కంపెనీకి సబ్సిడరీ అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఒక్క సేల్ డీడ్, ఎంవోయుయూ రద్దు చేయడానికి చట్టం చేయడం చెల్లదని పిటిషనర్ చెప్పడం సమంజసం కాదని..భూములు, ఒప్పందాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిందని పేర్కొన్నారు. పిటిషనర్ ఐఎంజీ భారత్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఒక ఒప్పందాన్ని, సేల్‌డీడ్‌ను రద్దు చేయడానికి చేసిన చట్టం చెల్లదని.. ఇది సింగిల్‌మెన్ లెజిస్లేషన్ అని.. ఏకవ్యక్తి కోసం చట్టం చేయడం చెల్లదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారాలు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంజీ భారత్ పిటిషన్‌ను కొట్టేసింది. గతనెలలో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది.