Share News

బదిలీలకు రంగం సిద్ధం!

ABN , Publish Date - May 29 , 2024 | 10:50 PM

ఎన్నికల కోడ్‌ ముగియగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగినా జిల్లా, మండల స్థాయిలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొన్ని శాఖల అధికారుల బదిలీలు జరిగాయి.

బదిలీలకు రంగం సిద్ధం!

ఎన్నికల కోడ్‌ ముగియగానే ఉమ్మడి జిల్లాలో భారీగా ట్రాన్స్‌ఫర్లు

మండల స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు

మంచి స్థానాల కోసం ముమ్మర ప్రయత్నాలు

ప్రభుత్వ ప్రకటనతో అధికారులకు కంటిమీద కునుకు కరువు

వికారాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల కోడ్‌ ముగియగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ స్థాయిలో బదిలీలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగినా జిల్లా, మండల స్థాయిలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొన్ని శాఖల అధికారుల బదిలీలు జరిగాయి. గత జూలై నెల నుంచి ప్రారంభమైన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల, జూన్‌ నెల మొదటి వారంతో ముగియనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించచనున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ జూన్‌ 6వ తేదీతో ముగియనుంది. తరువాత రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై దృష్టి సారించనుంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నతాధికారులకు ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వాలనే విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొన్ని శాఖల అధికారులు ఎన్నికలకు ముందు జిల్లా నుంచి బదిలీ ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు వికారాబాద్‌కు వచ్చిన వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఇంకా జిల్లాలోనే కొనసాగుతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీల తరువాత వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నట్లు తెలిసింది. ఆ తరువాత డివిజన్‌, మండల స్థాయి అధికారుల బదిలీలు జరగనున్నట్లు సమచారం.

స్వస్థలాలకు వచ్చేందుకు..

ఇదిలా ఉంటే, ఎన్నికల బదిలీల్లో సొంత జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన అధికారులు కూడా తిరిగి జిల్లాకు వచ్చేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించిన వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారుల్లో కొందరు ఎన్నికల బదిలీల్లో భాగంగానే వచ్చిన వారు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా నుంచి బదిలీ అయిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. కుటుంబాలకు దూరంగా వచ్చిన తమను తిరిగి తమ స్వంత స్థానాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఫారెస్ట్‌, పంచాయతీరాజ్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌ తదితర శాఖల్లో పనిచేస్తున్న అధికారులు తమకు అనుకూలంగా ఉండే పోస్టింగ్‌ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే బదిలీలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయిలో..

ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయిలో బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈసారి ఐఏఎస్‌ బదిలీల్లో వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) రాహుల్‌ శర్మకు పదోన్నతి కల్పించి ఏదైనా ఓ జిల్లాకు కలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జిల్లాకు వచ్చిన అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లింగ్యానాయక్‌ తనకు తానుగా ప్రయత్నిస్తే తప్ప ఇక్కడి నుంచి బదిలీ అయ్యే అవకాశం లేదని సమాచారం. తాండూరు ఆర్టీవో శ్రీనివాసరావు గత కొంత కాలం కిందట జిల్లాకు రాగా, వికారాబాద్‌ ఆర్డీవో వసుచంద్ర లోక్‌సభ ఎన్నికల ముందు జిల్లాకు వచ్చారు. ఎవరికి ఎక్కడ బదిలీ అవుతుందో తెలియక రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు.

ఉన్నచోటనే కొందరు...

కలెక్టరేట్‌లో సెక్షన్‌ ఇన్‌చార్జులుగా, డివిజన్‌ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారు కీలక మండలాల్లో పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మండలాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు తమకు లూప్‌ లైన్‌లో పోస్టింగ్‌ ఇవ్వకుండా, ఉన్నచోటనే కొనసాగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారమవుతోంది. రాజకీయ పలుకుబడి, అండదండలు ఉన్న వారు ఆ దిశగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జోన్‌, మల్టీజోన్‌ పరిధిలో పనిచేస్తున్న అధికారులు కూడా తమకు అనుకూలంగా ఉండే పోస్టింగ్‌ కోసం తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు.

దేనికి ప్రాధాన్యత ఇస్తారో?

త్వరలో జరగనున్న బదిలీల్లో పనితీరుకు ప్రాధాన్యత ఇస్తారా ? లేక గత ప్రభుత్వం మాదిరిగా సిఫారసులకే పెద్ద పీట వేస్తారా? అనేది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జిల్లా అధికారి నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారి వరకు ఎమ్మెల్యే సిఫారసులే చెల్లుబాటయ్యేవి. ఎమ్మెల్యే ఎవరిని సిఫారసు చేస్తే వారికే పోస్టింగ్‌ ఇచ్చేవారు. తమకు అనుకూలంగా పనిచేయడం లేదని భావిస్తే వెంటనే ఆ అధికారి స్థానంలో కొత్త అధికారికి పోస్టింగ్‌ ఇప్పించేవారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొనసాగినట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా పోస్టింగుల్లో సిఫారసులకే పెద్దపీట వేస్తారా ? లేక పనితీరుకు ప్రాముఖ్యత ఇస్తారా అనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది.

Updated Date - May 29 , 2024 | 10:51 PM