లక్ష్యం చేరేనా!
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:14 PM
మరో మూడు రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగియనున్నాయి. కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రాలకు వడ్లు రావడం చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వరకు కొనసాగించి ఆ తరువాత మూసి వేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈ సారి వానాకాలం సీజన్‌లో నిర్ధేశించుకున్న ధాన్యం సేకరణ లక్ష్యంలో 21 శాతం కూడా సేకరించకపోవడం గమనార్హం.

ధాన్యం సేకరణకు మరో మూడు రోజులే గడువు
వికారాబాద్ జిల్లాలో లక్ష్యంలో 21 శాతానికి మించని సేకరణ
మేడ్చల్ జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు
బయట మార్కెట్‌లో మద్దతు ధరకంటే అధిక ధర చెల్లింపు
పోటీ పడి కొనుగోలు చేసిన వ్యాపారులు, రైస్‌మిల్లర్లు
కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు
మరో మూడు రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగియనున్నాయి. కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రాలకు వడ్లు రావడం చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వరకు కొనసాగించి ఆ తరువాత మూసి వేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉంటే ఈ సారి వానాకాలం సీజన్‌లో నిర్ధేశించుకున్న ధాన్యం సేకరణ లక్ష్యంలో 21 శాతం కూడా సేకరించకపోవడం గమనార్హం.
వికారాబాద్/మేడ్చల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యం నిర్దేశించుకోగా, గురువారం వరకు జిల్లాలో 43,008.240 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగలిగారు. ఽపౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, 104 కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ కొనసాగింది. 27 ఐకేపీ, 48 పీఏసీఎస్, 27 డీసీఎంఎస్, 3 ఎప్‌పీవో కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈసారి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఽమెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 43 వేలమెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ధాన్యం ఉత్పత్తులు రావడం నిలిచిపోవడంతో గురువారం వరకు జిల్లాలో 93 కేంద్రాలు మూసివేశారు. 27 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరణ కొనసాగుతోంది. 6 పీఏసీఎస్, 3 డీసీఎంఎస్, ఒక ఎఫ్‌పీవో ఒక ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. మూడు రోజుల తరువాత జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయనున్నారు.
కేంద్రాలకు తగ్గిన ధాన్యం
ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చాలా తగ్గింది. ధాన్యం ఉత్పత్తులు బాగా ఉన్నప్పటికీ ఈ కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కంటే ఓపెన్ మార్కెట్లోనే ఎక్కువగా ధాన్యం విక్రయించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ధర కొంత అధికంగా పలకడంతో రైతులు తమ ధాన్యం ఉత్పత్తులను ఓపెన్ మార్కెట్‌కు తరలించారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గింది. ఈసారి ఓపెన్ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు, వ్యాపారులు పోటీ పడడంతో ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికింది.
రైతుల ఖాతాల్లో రూ.57.31 కోట్లు జమ
జిల్లాలో సేకరించిన 43,000.240 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.94,74,71,527 చెల్లించాల్సి ఉండగా, గురువారం వరకు 26,018.240 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.57,31,81,827జమ చేశారు. ఇంకా 16,990 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో రూ.37,42,89,700 జమ చేయాల్సి ఉంది. ఈసారి ధాన్యం విక్రయించిన రైతులకు ఎదురు చూపులు లేకుండానే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. మిగిలిన రైతులకు సంబంధించిన ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల వద్ద అప్‌లోడ్ చేయకపోవడం వల్ల డబ్బులు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్ కాగానే సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలో 30 శాతానికి మించని ధాన్యం సేకరణ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది అంచనాలో 30 శాతం కూడా ధాన్యం కొనుగోలు కాలేదు. జిల్లాలో 12 ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 30 వేల టన్నుల ధాన్యం సేకరణ అంచనా వేసినప్పటికీ కేవలం 9,838 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగినట్లు అధికారులు తెలిపారు. 1,810 మంది రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించారు. వారికి రూ.21.66 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. బయట మార్కెట్‌లో ధాన్యంకు డిమాండ్ ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు.