Share News

రేషన్‌ కార్డు గుర్తింపు కోసమే..

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:05 PM

రైతురుణ మాఫీతో కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందని, దీన్ని జీర్ణించుకోలేని విపక్షాలు రుణమాఫీపై దృష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు.

రేషన్‌ కార్డు గుర్తింపు కోసమే..
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

- నేటి నుంచే రుణమాఫీ.. రైతు సంబురాలు

- బీజేపీ దద్దమ్మలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

- దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జూలై 17 : రైతురుణ మాఫీతో కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందని, దీన్ని జీర్ణించుకోలేని విపక్షాలు రుణమాఫీపై దృష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు అనేది గుర్తింపుకోసమే తప్ప అది ప్రామాణికం కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా ఇంకా బీజేపీ దద్దమ్మలు వక్రీకరిస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ రుణమాఫీపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలలో కేవలం మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ హామీని అమలు చేయలేదని, ఇక్కడి బీజేపీ ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు ఎంపీగా ఎలా గెలిచారో అందరికీ తెలుసునని, బీఆర్‌ఎస్‌ ఓట్లతో గెలిచిన మీరు నేను ముఖ్యమంత్రి జిల్లాలో గెలిచానని చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ రైతులకు రుణమాఫీ చేయదు కానీ, బడా కార్పొరేట్‌లు, పారిశ్రామికవేత్తలకు రూ.25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన చరిత్ర మీదన్నారు. బీఆర్‌ఎస్‌కు మనుగడ, భవిష్యత్‌ లేదని ఆపార్టీ ఎమ్మెల్యేలు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన అన్నారు. గతంలో మీరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని, ఇప్పుడు అదే బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కలవడం విచారకరమన్నారు. రైతులంతా పెద్దఎత్తున సంబురాలు చేసుకోవాలని, ముందుగా లక్ష లోపు, రుణాలు తొందర్లోనే రూ.2 లక్షల రుణాలను మొత్తం మాఫీ చేస్తామన్నారు. సమావేశంలో నాయకులు అరవింద్‌రెడ్డి, సీజే బెనహర్‌, చంద్రశేఖర్‌, నాగిరెడ్డి పాల్గొన్నారు.

ప్రతీ కుటుంబానికి పథకాలను అందిస్తాం : ఎమ్మెల్యే

దేవరకద్ర, జూలై 17 : కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్నచింతకుంట మండల పరిధిలోని దమగ్నాపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచారన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, రెండు మండలాల పార్టీ అధ్యక్షులు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మండల నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఆది హన్మంతురెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హన్మంతురెడ్డి, నరసింహారెడ్డి, కిషన్‌రావు, రాంపాండు, ఫారుక్‌అలీ, నరసింహ, తహసీల్దార్‌ ఎల్లయ్య, ఆర్‌ఐ శరత్‌, సురేష్‌, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2024 | 11:05 PM