Share News

Prime Minister Modi : అధర్మంగా వస్తే.. రాముడు తీసుకోవద్దన్నారు

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:13 AM

శ్రీరాముడు తలచుకుంటే సాగరం అడుగునున్న నేలను కూడా సొంతం చేసుకోగలడని.. కానీ, అధర్మ మార్గంలో ఇంద్రప్రస్థం లభించినా స్వీకరించబోనని లక్ష్మణుడికి చెప్పాడని, విధి ..

Prime Minister Modi : అధర్మంగా వస్తే..  రాముడు తీసుకోవద్దన్నారు

కొందరు అధికారులు దీనిని గుర్తుంచుకోవాలి.. సుపరిపాలనకు రామరాజ్యమే మనకు ప్రేరణ

ప్రజలు చెల్లించే ప్రతి పైసా వారి సంక్షేమానికే

పన్ను సంస్కరణల ఫలితాలు కళ్లముందున్నాయి

25 కోట్లమంది పేదరికాన్ని జయించారు

సుపరిపాలనకు ‘నాసిన్‌’ సరికొత్త కేంద్రం

ఏపీలోని సత్యసాయి జిల్లాలో అతిపెద్ద నాసిన్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

లేపాక్షిలో వీరభద్రుడికి స్వయంగా హారతి

అల్లూరి జిల్లా గిరిజనులతో ముఖాముఖి

పుట్టపర్తి, అరకు లోయ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీరాముడు తలచుకుంటే సాగరం అడుగునున్న నేలను కూడా సొంతం చేసుకోగలడని.. కానీ, అధర్మ మార్గంలో ఇంద్రప్రస్థం లభించినా స్వీకరించబోనని లక్ష్మణుడికి చెప్పాడని, విధి నిర్వహణలో చిన్నచిన్న ప్రలోభాలతో కర్తవ్యాన్ని మరచిపోతున్న అధికారులు ఈ మాటలను తప్పక గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. సుపరిపాలనకు రామరాజ్యమే అసలైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో దేశంలోనే అతిపెద్ద కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల నియంత్రణ జాతీయ అకాడమీ (నాసిన్‌) క్యాంప్‌సను మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఆధునిక పన్ను వ్యవస్థను అందించడమే నాసిన్‌ లక్ష్యమన్నారు. అధికారాలను వివేకంతో వినియోగించాలని.. తప్పుడు మార్గాన్ని అనుసరించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ విషయంలో శ్రీరాముడి జీవితం నుంచే ప్రేరణ లభిస్తుందన్నారు. ‘‘నాసిన్‌ కేంద్రం సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుంది. దేశంలోని వ్యాపార, పరిశ్రమలకు నూతన దిశ కల్పించనుంది’’ అని తెలిపారు. నాసిన్‌లో శిక్షణ పొందుతున్న ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌) అధికారులను అమృత కాలానికి నేతృత్వం వహించే ‘కర్మయోగుల అమృత బృందం’గా మోదీ అభివర్ణించారు. వ్యాపార కార్యకలాపాలను సులభం చేసే ఆధునిక ఎకో సిస్టంను ఇవ్వడమే నాసిన్‌ విధి అని చెప్పారు. భారత్‌ను ప్రపంచ వాణిజ్యంలో కీలక భాగస్వామిని చేయగలిగే స్నేహపూర్వక వాతావరణం సృష్టించాలన్నారు.

రామరాజ్యంలో లాగానే పన్నుల వ్యవస్థ

రామరాజ్యంలో పన్నులు ఎలా ఉండేవో తులసీదాస్‌ వివరించారని, మన పన్నుల వ్యవస్థ కూడా అలా ఉండాలని మోదీ పేర్కొన్నారు. పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వినియోగించాలని స్పష్టం చేశారు. ఇదే ప్రేరణతో జీఎస్టీ రూపంలో దేశానికి ఆధునిక వ్యవస్థను అందించామని, ఆదాయపు పన్ను వ్యవస్థను సులభం చేశామని చెప్పారు. అంతకుముందటి పన్నుల వ్యవస్థ సామాన్య ప్రజలకు అంత సులువుగా అర్థమయ్యేది కాదన్నారు. పన్ను వసూళ్లు పెరగడం వల్ల, ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా ఆ డబ్బును ప్రజలకే వినియోగిస్తోందని తెలిపారు. తమ డబ్బు సద్వినియోగమం అవుతుండడం పన్ను చెల్లింపుదారులంతా చూస్తున్నారన్నారు. అందుకే పన్ను చెల్లించేందుకు సంతోషంగా ముందుకువస్తున్నారని తెలిపారు. ఇదే సుపరిపాలన అని, ఇదే రామరాజ్య సందేశం అని మోదీ చెప్పారు. గతంలో ప్రాజెక్టులను తొక్కిపెట్టడం, ముందుకు సాగనీయని వ్యవస్థ ఉండేదని, దాని వల్ల చాలా నష్టం జరిగిందని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చే పనుల్లో ఆలస్యం చేయకూడదని భరతుడికి శ్రీరాముడు నిర్దేశించారని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం కూడా ఇదే సూత్రాన్ని పాటించిందన్నారు.. ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి పైసా నిజమైన హక్కుదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుతోందని తెలిపారు. 10 లక్షల అనర్హుల పేర్లను రికార్డుల నుంచి తొలగించామని చెప్పారు. నీతి ఆయోగ్‌ నివేదిక తొమ్మిదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించిందని మోదీ తెలిపారు. పేదరిక నిర్మూలన నినాదాలు ఇచ్చే దేశంలో ఇది చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థను నెలకొల్పడం గర్వకారణమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రం పేరు, ప్రతిష్టలను నాసిన్‌ అంతర్జాతీయంగా నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, చారిత్రక, పురాతన వైభవానికి శ్రీసత్యసాయి జిల్లాలోని లేపాక్షి నిదర్శనమని, విజయనగర సామ్రాజ్య సంస్కృతీ వైభవాన్ని చాటే ఇక్కడి శిల్పసంపద మహా అద్భుతమని మోదీ అభివర్ణించారు. లేపాక్షిని ఆయన సందర్శించారు. ఆలయంలో వీరభద్రస్వామికి హారతి ఇచ్చారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట కళాకారులు ప్రధాని కోసం తోలు బొమ్మలాటను ప్రదర్శించారు. రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని తోలుబొమ్మల ఆట ద్వారా వీక్షించిన మోదీ పరవశించిపోయారు.

అల్లూరి జిల్లా గిరిజనులతో మోదీ ముఖాముఖి

ఆదివాసీల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని మోదీ అన్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధి అరకులోయ మండలం కొత్తభల్లుగుడ గిరిజనులతో వర్చువల్‌ సమావేశంలో ముచ్చటించారు. గిరిజనాభివృద్ధి పథకాలను వివరించిన అనంతరం కొత్తభల్లుగుడ పంచాయతీ గద్యాగుడ గ్రామానికి చెందిన స్వాబి గంగతో ప్రధాని ముఖాముఖి సంభాషించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కదా.. మీరెలా ఫీలవుతున్నారు? అని అడిగారు. సంతోషంగా ఉందని.. గతంలో తాము కాఫీ పంట దళారులకు విక్రయించి నష్టపోయేవాళ్లమని ఇప్పుడు గ్రేడింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ చేస్తూ మంచి ధర పొందుతున్నామని స్వాబి చెప్పారు.

పీఎం జన్‌మన్‌ కింద ఆదివాసీలకు పక్కా ఇళ్లు: మోదీ

తొలి విడతగా రూ.540 కోట్లు విడుదల

అచ్చంపేట/మన్ననూరు, జనవరి 16 : దేశంలోని గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పీఎం-జన్‌మన్‌(ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌) ద్వారా ఆదివాసీలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా లక్ష మంది పీఎంఏవై-జీ(ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ్‌) లబ్ధిదారులకు పఎం జన్‌మన్‌ కింద తొలి విడతగా రూ.540 కోట్లను ప్రధాని మోదీ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న జన్‌మన్‌ లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌ ఆదివాసీ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి జిల్లాకు చెందిన ఆదివాసీ చెంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పీఎం జన్‌మన్‌ ద్వారా ఆదివాసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రూ.24వేల కోట్లు కేటాయించామని చెప్పారు. జన్‌మన్‌ కింద తొలి విడతగా రూ.540 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వచ్చే దీపావళిలోగా సొంతిల్లు లేని ఆదివాసీలు ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారుని ఖాతాలో రూ.2.50 లక్షలు జమ చేస్తామని వివరించారు. కాగా, జన్‌మన్‌ పథకం కింద ఎంపిక చేసిన పలువురు ఆదివాసీలకు కొత్త ఆధార్‌ కార్డులు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, కులధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 09:34 AM