Share News

రాజ్యసభ ఎన్నికలు 27న

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:56 AM

రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపిక కోసం ఫిబ్రవరి 27న పోలింగ్‌

రాజ్యసభ ఎన్నికలు 27న

8వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల

15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

తెలంగాణ, ఏపీలో 3 సీట్ల చొప్పున ఖాళీ

ఏప్రిల్‌ 2తో ముగియనున్న బడుగు లింగయ్య,

వద్దిరాజు, సంతోష్‌కుమార్‌ పదవీకాలం

2 కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు దక్కే చాన్స్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపిక కోసం ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించేందుకు సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే నెల 8న నోటిఫికేషన్‌ విడుదల చేసి 15 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. 16న నామినేషన్లను పరిశీలించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 20వ తేదీ చివరి గడువు. 27వ తేదీన ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ను నిర్వహించి అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌ నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీ నుంచి చెరో మూడు రాజ్యసభ స్థానాలు ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కానున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్‌ఎ్‌సకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతో్‌షకుమార్‌ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. అలాగే ఏపీ నుంచి టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీకి చెందిన సీఎం రమేష్‌, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్‌ 2తో ముగుస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఖాళీ అయ్యే 6 సీట్లను ఈసీ భర్తీ చేయనుంది. మిగిలిన సీట్లలో ఉత్తరప్రదేశ్‌ నుంచి 10, బిహార్‌నుంచి 6, మహారాష్ట్ర.నుంచి 6, మధ్యప్రదేశ్‌నుంచి 5, పశ్చిమ బెంగాల్‌నుంచి 5, గుజరాత్‌, కర్ణాటకలనుంచి చెరో 4, ఒడిశా, రాజస్థాన్‌లలో మూడు సీట్ల చొప్పున రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, హరియాణా, హిమచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

మూడింటిలో రెండు కాంగ్రె్‌సకు.. ఒకటి బీఆర్‌ఎ్‌సకు

తెలంగాణ నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీకి 2 సీట్లు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక సీటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థి ఎన్నిక కావడానికి అవసరమైన ఓట్లను నిర్దారించే సూత్రాన్ని బట్టి.. ఒక్కో రాజ్యసభ సీటుకు 30 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీపీఐతో కలుపుకొని కాంగ్రెస్‌ పార్టీకి 65 సీట్లు ఉండగా.. బీఆర్‌స్‌ పార్టీకి 39 సీట్లు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా రెండు సీట్లను, బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక సీటును గెలుచుకునేందుకు వీలుంటుంది. మూడో సీటుకూ అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలనుకుంటే మాత్రం.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆ పార్టీ ప్రోత్సహించాల్సి వస్తుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్‌రెడ్డిని.. ఆయన నివాసానికి వెళ్లి కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ సమస్యలపై కలుస్తున్నామని వారు చెబుతున్నా.. ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ చేయి చేజారుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఎంఐఎం అధినాయకత్వమూ క్రమంగా కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతుందన్న ప్రచారం నేపథ్యంలో పదిమందికి పైగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరైనా.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినా మూడో సీటూ కాంగ్రెస్‌ పార్టీకే దక్కే చాన్స్‌ ఉందనీ చెబుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అంత రిస్కు తీసుకుంటుందా అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఒక సీటు అధిష్ఠానానికి

కాంగ్రె్‌సకు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్ఠానానికి టీ కాంగ్రెస్‌ అప్పగించనుంది. తెలంగాణ యేతర అభ్యర్థిని ఆ సీటుకు పార్టీ అధిష్ఠానం ఎంపిక చేయనుంది. మిగిలిన ఒక్క సీటుకు రాష్ట్రం నుంచి పోటీ తీవ్ర పోటీ నెలకొని ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కనున్న సీటులో కేసీఆర్‌ కుటుంబ సభ్యుడైన సంతో్‌షకుమార్‌నే మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారా.. లేక మరెవరినైనా నియమిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Jan 30 , 2024 | 09:40 AM