రాజుకుంటున్న మునిసిపల్ రగడ
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:37 AM
రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో అసమ్మతి రగడ రాజుకుంటోంది.

రాష్ట్రవ్యాప్తంగా 29 మునిసిపాలిటీల్లో
అవిశ్వాస నోటీసులు
వర్ధన్నపేట చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌పైనా..
బెల్లంపల్లి చైర్‌పర్సన్‌పై నేడు అవిశ్వాసం
బీఆర్‌ఎస్‌కు 18 మంది కౌన్సిలర్ల గుడ్‌బై
ఇప్పటికే ఆర్మూరు, నల్లగొండ హస్తగతం
మలుపులు తిరుగుతున్న పుర రాజకీయం
ఈ నెలాఖరుకు నాలుగేళ్ల పాలన పూర్తి
గవర్నర్ వద్దే మునిసిపల్ చట్టసవరణ బిల్లు
ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌పైనా అవిశ్వాసం!
హైదరాబాద్/మంచిర్యాల/వర్ధన్నపేట/ఖమ్మం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో అసమ్మతి రగడ రాజుకుంటోంది. మెజారిటీ మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉండగా.. చాలా చోట్ల కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మునిసిపాలిటీల్లో ఈ నెలాఖరుకు నాలుగేళ్ల పాలన పూర్తవుతోంది. ఇప్పటికే 29 మునిసిపాలిటీల్లో అసమ్మతి వర్గం అవిశ్వాస నోటీసులు అందజేసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గత ప్రభుత్వం నాలుగేళ్ల వరకు అవిశ్వాస నోటీసులు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు మునిసిపల్ చట్టసవరణ చేసి గవర్నర్ కు పంపింది. అయితే ఆ చట్టం రాజభవన్ గడప నుంచి బయటికిరాలేదు. జనవరి నెలాఖరుకు అన్నీ మునిసిపాలిటీలలో నాలుగేళ్ల పాలన ముగుస్తోంది. చైర్మన్లు, వైస్ చైర్మన్లపై చాలా చోట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్మూరు, నల్లగొండ మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సూర్యాపేట మునిసిపాలిటీలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పోకడలను వ్యతిరేకిస్తూ మెజారిటీ సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మునిసిపాలిటీల్లో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. చాలాచోట్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. మెజారిటీ కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా అభివృద్ధి పనుల్లో తమను భాగస్వాములను చేయలేదని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు.
బెల్లంపల్లిలో 18 మంది కౌన్సిలర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా
బెల్లంపల్లి మునిసిపాలిటీలోనూ అసమ్మతి రగడ రాజుకుంది. మునిసిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్ నుంచి 22 మంది, కాంగ్రెస్ తరఫున 12 మంది గెలిచారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ గెలవడంతో అవిశ్వాసం ముప్పు తప్పించుకునేందుకు బీఆర్‌ఎ్‌సకు చెందిన చైర్‌పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రె్‌సలో చేరారు. చైర్‌పర్సన్ ఒంటరిగా వెళ్లడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. రెండు పార్టీల కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపునకు వెళ్లారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమావేశానికి ఒకరోజు ముందు బీఆర్‌ఎ్‌సకు చెందిన 18 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశా రు. కాగా, చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వా సం పెట్టేందుకు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు.
వర్ధన్నపేటలో..
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మునిసిపాలిటీ చైర్‌పర్సన్ అంగోతు అరుణ, వైస్ చైర్మన్ కోమండ్ల ఎలేందర్‌రెడ్డిపై 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. గురువారం కౌన్సిలర్లు కలెక్టరేట్‌కు చేరుకోగా కలెక్టర్ ప్రావీణ్య అందుబాటులో లేకపోవడంతో వరంగల్ ఆర్‌డీవో వాసుచంద్రకు అవిశ్వాసం నోటీసులను అందజేశారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన వారిలో బీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ ఉన్నారు. మునిసిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం!
బీఆర్‌ఎ్‌సకు చెందిన ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్యకు పదవీ గండం ఎదురుకాబోతోంది. ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 13మంది డైరెక్టర్లుగాను 11మంది డైరెక్టర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా సహకార అధికారి విజయకుమారికి గురువారం లేఖ అందించారు.
మంచిర్యాల మునిసిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం
మంచిర్యాల: మంచిర్యాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్డీవో రాములు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్ నుంచి 26, కాంగ్రెస్ తరఫున 10 మంది గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు విజయం సాధించడంతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 16 మంది కాంగ్రె్‌సలో చేరారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 26కు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. నాలుగేళ్లపాటు చైర్మన్, వైస్ చైర్మన్లుగా పదవులు అలంకరించిన పెంట రాజయ్య, గాజుల ముకే్‌షగౌడ్ మరో సంవత్సరం కాలపరిమితి ఉండగానే పదవులు కోల్పోయారు.