Share News

ఎండలకు కాస్త బ్రేక్‌.. మూడ్రోజుల పాటు వానలు!

ABN , Publish Date - May 07 , 2024 | 06:11 AM

భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది. వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

ఎండలకు కాస్త బ్రేక్‌..  మూడ్రోజుల పాటు వానలు!

నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వానలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చాలా

చోట్ల 46 డిగ్రీలపైనే నమోదు

వడదెబ్బతో ముగ్గురి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది. వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.


ఉమ్మడి కరీంనగర్‌లో 46 డిగ్రీల పైనే..

ఇటు సోమవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుల్లకోటలో 46.8, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, అదే జిల్లా సుగ్లాంపల్లి, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 46.3, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46.2, జగిత్యాల జిల్లా గోధూరులో 46.1, మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 46, ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక చాలా జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం రూరల్‌ మండలం కాంచికల్‌ గ్రామానికి చెందిన వృద్ధుడు గుండ్రా లక్ష్మయ్య (75), ఎర్రుపాలెం మండలంలోని పెద్దగోపవరంలో రాసమంటి వెంకటకృష్ణ (45), సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెంది దారా జీవమ్మ (50) ఎండలకు అస్వస్థత చెంది మరణించారు.

ఎండ వేడికి చేపల మృత్యువాత..!

వేసవి తాపానికి చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌లోని కాముని చెరువులో ఉన్న కొద్ది నీరు కాస్త ఎండకు బాగా వేడిగా మారడంతో ఆ చెరువులోని రూ.లక్షన్నర విలువ చేసే చేపలు చనిపోయి నీటిపై తేలాయి. ఇటు శంషాబాద్‌ మునిసిపల్‌ కేంద్రంలోని కాముంచెర్వులో ఆరు రోజులుగా దాదాపు రూ.7 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. చెరువుకి సమీపంలో ఉన్న హోటళ్లకు చెందిన డ్రైనేజీల నీరు చేరడంతో నీరు కలుషితమై చేపలు మృత్యువాత పడుతున్నాయా లేక ఎండ వేడిమికి మృతి చెందుతున్నాయో అర్థం కావడం లేదని గంగపుత్ర సంఘం సభ్యులు సాయిరాం, జగన్నాథం వాపోయారు.

Updated Date - May 07 , 2024 | 06:11 AM