Share News

దారులన్నీ ‘తుక్కుగూడ’ వైపే..

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:59 AM

లోక్‌సభ ఎన్నికల నేపఽథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో నిర్వహించిన ‘జనజాతర’ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తుక్కుగూడలో ఎక్కడ చూసినా జనం సందడే కనిపించింది.

దారులన్నీ ‘తుక్కుగూడ’ వైపే..

కాంగ్రెస్‌ జన జాతర విజయవంతం

అంచనాలకు మించిన హాజరైన జనం

కిక్కిరిసిన సభా ప్రాంగణం

24 లక్షల వాటర్‌ బాటిళ్లు, 12 లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

ఆకట్టుకున్న రాహుల్‌ ప్రసంగం

సీఎం రేవంత్‌ వాగ్దాటితో జనంలో జోష్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో నిర్వహించిన ‘జనజాతర’ సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తుక్కుగూడలో ఎక్కడ చూసినా జనం సందడే కనిపించింది. తుక్కుగూడ రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చే సమయానికే సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేలాదిగా ప్రజలు రోడ్ల మీదే ఉండిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి.. ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని శనివారం తక్కుగూడ సభ నుంచి రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాగా, జన జాతర సభకు గతంలో జరిగిన ప్రజాగర్జనకు మించి జనం హాజరయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సభ ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల తరువాత ప్రజలు రావటం మొదలైంది. గంటసేపట్లోనే సభా ప్రాంగణం జనంతో నిండిపోయింది. రాహుల్‌ గాంధీ రాత్రి ఏడు గంటలకు చేరుకున్నారు.

భారీ ఎత్తున ఏర్పాట్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత, ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సభ కాబట్టి.. తక్కుగూడ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజధాని హైదరాబాద్‌తోపాటు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా భారీగానే తరలించారు. రాష్ట్రంలోని 30 వేల పోలింగ్‌ బూత్‌ల వారీగా జనసమీకరణ జరిపారు. సభకు హాజరైన లక్షలాది మందికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంలో 24 లక్షల వాటర్‌ బాటిళ్లు, 12 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అత్యవసర వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. వేదిక వెనుక భారీ స్ర్కీన్‌తోపాటు సభ ప్రాంగణంలో జనాలకు కనిపించే విధంగా నలుమూలల స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేయి మందికి పైగా పోలీస్‌ సిబ్బందిని నియమించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, వేదికపై కళాకారుల పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. '

ఆసక్తిగా విన్న ప్రజలు

రాహుల్‌గాంధీ ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రజల కోసం తమ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను రాహుల్‌ వివరిస్తుంటే జనం ఆసక్తిగా విన్నారు. ఆయన ప్రసంగాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగులో అనువదించారు. సభలో చివరిగా ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వాగ్దాటితో జనంలో జోష్‌ నింపారు. కాగా, జనజాతర సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్‌గాంధీకి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. సాయంత్ర 6 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌ గాంధీకి సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు.

Updated Date - Apr 07 , 2024 | 03:59 AM