Share News

రాహుల్‌ ప్రసంగమంతా అబద్ధాలే

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:04 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తుక్కుగూడ సభలో చేసిన ప్రసంగం అబద్ధాల పుట్ట, పచ్చి బూటకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ధైర్యముంటే అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు

రాహుల్‌ ప్రసంగమంతా అబద్ధాలే

ఆరు గ్యారెంటీలపై చర్చకు సిద్ధమా?..

రాష్ట్రంలో ఏం చేశారని.. దేశాన్ని ఉద్ధరిస్తారు

రేవంత్‌ ముఖ్యమంత్రి అయింది.. ఈవీఎంలతో కాదా..?: కిషన్‌రెడ్డి

ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి

గవర్నర్‌కు బీజేపీ నేతల వినతి పత్రం

కేసీఆర్‌ది మొసలి కన్నీరు: సంజయ్‌

హైదరాబాద్‌/కరీంనగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తుక్కుగూడ సభలో చేసిన ప్రసంగం అబద్ధాల పుట్ట, పచ్చి బూటకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ధైర్యముంటే అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా.. వాటిని గారడీలుగా మార్చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ సర్కారు ఏం చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్‌ ఉన్నారని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రైతు రుణమాఫీ చేయకుండా దేశాన్ని ఏదో ఉద్ధరిస్తానని రాహుల్‌ అంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ.4వేల నిరుద్యోగ భృతికి దిక్కులేదని.. ఇక దేశంలోని నిరుద్యోగులకు సాయం గురించి రాహుల్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రేవంత్‌ సీఎం అయింది ఈవీఎంలతో కాదా..? అని నిలదీశారు. ‘గెలిస్తే మీ నాయకత్వం గొప్పదనం.. ఓడితే ఈవీఎంలదా..?’ అని ప్రశ్నించారు. కాగా, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. హామీల అమలుపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని.. ఆయన దృష్టి అంతా పార్టీ ఫిరాయింపులపైనే ఉందని విమర్శించారు.

ట్యాపింగ్‌ను వదిలిపెట్టం: లక్ష్మణ్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ లక్ష్మణ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరాలని వినతిపత్రం అందజేసింది. గవర్నర్‌తో సమావేశం అనంతరం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్‌ చేశారు. ట్యాపింగ్‌ వ్యవహారాన్ని బీఆర్‌ఎ్‌సతో లాలూచీ పడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తేలికగా తీసుకున్నా.. తాము వదలిపెట్టబోమని తేల్చిచెప్పారు. ట్యాపింగ్‌ బాధితుల్లో బీజేపీ నాయకులు కూడా ఉన్నందున కేంద్రం జోక్యాన్ని కోరతామన్నారు.

నా ఫోన్‌ కూడా ట్యాప్‌ అయింది: సంజయ్‌

కాళేశ్వరం అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వం తన ఫోన్‌నూ ట్యాప్‌ చేసిందని, బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుకున్నవి తెలుసుకున్నారని వెల్లడించారు. కరీంనగర్‌లో సంజయ్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకే దిక్కులేదని, మళ్లీ పాంచ్‌ న్యాయ్‌పేరుతో కాంగ్రెస్‌ హామీలిస్తోందని విమర్శించారు. రైతులపై కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. నేతన్నలను ఆదుకోవాలన్న డిమాండ్‌తో సిరిసిల్లలో 10న దీక్ష చేపడతామన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 04:04 AM