Manchiryāla- ప్రజా రక్షణే ధ్యేయం
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:25 PM
ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రజా రక్షణే ధ్యేయమని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు.

హాజీపూర్, జూన్ 12: ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రజా రక్షణే ధ్యేయమని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. వరదలు, లోతట్టు ప్రాంతా ల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం 40 మంది పోలీసు సిబ్బంది హైద్రాబాద్‌లోని ఎన్‌డీఆర్‌ఎఫ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన వారితో బుధవారం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల జిల్లాలో వర్షాలకాలంలో కురిసే వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి కాపాడేందుకు కావాల్సిన వస్తువులను కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు చేశామని చెప్పారు. 44 మంది సభ్యులతో ప్లడ్ రెస్య్కూటీం తయారు చేశామని చెప్పారు. వీరు వరదలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడుతారన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది వర్షాకాలంలో మంచిర్యాల జోన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఆపద జరగకుండా తక్షణమే వారిని కాపాడాలనే ఉద్దేశ్యంతో రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీతో కలిసి ఒక టీంలా ఏర్పడి స్లడ్ ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో జరిగిన విధంగా ఎలాంటి సంఘటనలు జరిగినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్, గోదావరి ఖని ఏసీపీ రమేశ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, మంచిర్యాల రూరల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్, సీఐ అజయ్‌బాబు, ఆర్ శ్రీనివాస్, వామనమూర్తి, దామోదర్, రామగుండం, హాజీపూర్ ఎస్‌ఐలు సతీష్, సురేష్, ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు పాల్గొన్నారు.
సర్వే త్వరగా పూర్తి చేయాలి
హాజీపూర్: జిల్లాలో మిషన్ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటి నల్లా కనెక్షన్‌ల సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మండలంలోని గుడిపేట గ్రామంలో సర్వే ప్రక్రియలో భాగంగా స్వయంగా యాప్‌లో వినియోగదారుల వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటా నల్లా కనెక్షన్‌ల సర్వేను వేగవంతం చేయాలని, జిల్లాలోని నల్లా కనెక్షన్‌లు కలిగిన నివాసాలు, ఇంకా ఇవ్వాల్సిన నల్లా కనెక్షన్‌లు, నూతనంగా నిర్మించబడడిన నివాసాలకు ఇవ్వాల్సిన నల్లా కనెక్షన్‌లు ఇతర పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయనున్నామని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి యాజ మానితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, కులం, ఫోన్ నంబర్ ఇతర వివరాలు, నీటి సరఫరాలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో పొందుపర్చాలని తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సతీష్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ తదితరులు ఉన్నారు.