పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ వివాదం
ABN , Publish Date - Feb 19 , 2024 | 06:08 AM
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది.
శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మర్రి జనార్దన్‌రెడ్డి
అధికారులపై ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి ఆగ్రహం
పాఠశాలను ప్రారంభించకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే
తాడూరు, ఫిబ్రవరి18: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారింది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో తాను చదివిన పాఠశాల కావడంతో మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో నూతన భవనం, వంట గదిని నిర్మించారు. గత ప్రభుత్వ ‘మన ఊరు మన బడి’ పథకంలో భాగంగా రూ.50 లక్షలతో ప్రహ రీ, మూత్రశాలలు నిర్మించారు. పనులు పూర్తవడంతో ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో ప్రారంభోత్సవం కోసం ప్రస్తుత ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే్‌షరెడ్డితోపాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జనార్దన్‌రెడ్డి సతీసమేతంగా పాఠశాలకు చేరుకున్నారు. తర్వాత ఎంపీపీ శ్రీదేవితో రిబ్బన్ కట్ చేయించాక పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆయన వెళ్లిన కొంతసేపటికి ఎమ్మెల్యే రాజే్‌షరెడ్డి తన అనుచరులతో పాఠశాల ప్రాంగణానికి వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చేతులమీదుగా జరగాల్సిన ప్రారంభోత్సవాన్ని వేరేవారితో ఎలా చేయిస్తారంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం చాంద్‌పాషా, డీఈవో గోవిందరాజులుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనం తరం పాఠశాలను ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. దీంతో పాఠశాల ప్రారంభోత్సవాన్ని రద్దు చేసినట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు విలేకరులకు తెలిపారు. మర్రిజనార్దన్‌రెడ్డి తన అనుచరులతో ముందే వచ్చి పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం వద్దన్నా విన కుండా వారు తెచ్చుకున్న రిబ్బన్‌ను గేటుకు కట్టి ప్రారంభించారన్నారు.
మాజీ ఎమ్మెల్యే మర్రిపై కేసు నమోదు
పాఠశాల ప్రారంభోత్సవం వివాదం నేపథ్యం లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రాజే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వివాదం పై పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం చాంద్‌పాషా ఆదివారంరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తెలియకుండా రిబ్బన్ ఏర్పాటు చేసి కత్తిరించారని, దీంతో తమకు సంబంధంలేదన్నారు.